రాజరాజేశ్వర స్వామిని దర్శించిన హైకోర్టు జడ్జి
కరీంనగర్, జూలై 7 : పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నాగార్జునరెడ్డి తన కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. వేదపండితులు మంత్రోచ్చరణల మధ్య ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై స్వామివారికి అర్చక స్వాములు అర్చనలు జరిపారు. పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి శేషవస్త్రంతో పాటు ప్రసాదం, చిత్రపటాన్ని అందించి ఆలయ ఇఓ అప్పారావు శాలువా కప్పి సత్కరించారు. ఆలయాల్లో పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఆలయ అధికారులపై ఎంతైనా ఉందని అన్నారు. రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడం తనకు తన కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉందని అన్నారు. ఈయన వెంట స్వామిని దర్శించుకున్న వారిలో పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, జిల్లా జడ్జి కుమారి తదితరులున్నారు.