రాజీనామా చేయనన్న ఢిల్లీ కమిషనర్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22( జనంసాక్షి):
దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాజీనామా వార్తలను  ఢిల్లీ పోలీసు కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ సోమవారం ఖండించారు. తన రాజీనామాతో సమాజం మారుతుందని భావిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. తన రాజీనామాతో సమస్య పరిష్కారమవుతుందంటే వెయ్యిసార్లు రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు.  ఆయన రాజీనామా చేయాల్సిందేనని ఆందోళనకారులతో సహా, ఎంపీ బృందాకారత్‌ డిమాండ్‌ చేశారు. ఒక పత్రికా విలేకరి తప్పు చేస్తే సంపాదకులు రాజీనామా చేస్తారా? అన్నారు. చిన్నారిపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అత్యాచార ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టామన్నారు. ఆరోపణలు వచ్చిన పోలీసులను సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులను వదిలి పెట్టేది లేదన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేసారు. అంతకుముందు లెఫ్ట్‌ పార్టీ నేత బృందాకారత్‌ కమిషనర్‌ రాజీనామాకు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా కమిషనర్‌ రాజీనామా చేయాలంటూ భారీగా ఆందోళనకారులు సోమవారం ఆయన కార్యాలయాన్ని ముట్టడించారు. ఢిలల్‌ఈలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.