రాజీవ్‌కు ఘన నివాళి

న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి) :
మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీకి యావత్‌జాతి ఘనంగా నివాళులు అర్పించింది. ఆయన చేసిన సేవలను స్మరించుకుంది. మంగళవారం రాజీవ్‌ 22వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మృతివనం వీర్‌భూమి వద్ద పలువురు నివాళుర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్‌ వాద్రా తదితరులు రాజీవ్‌ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌, కేంద్ర మంత్రులు సల్మాన్‌ ఖుర్షీద్‌, ఏకే ఆంటోనీ, కమల్‌నాథ్‌ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మూడు రంగుల  బెలూన్లను ఎగురవేశారు. 1991 మే 21న తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్‌గాంధీ శ్రీపేరంబదూర్‌లో హత్యకు గురయ్యారు. ఐఏసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుర్పించారు. రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకుతీసుకెళ్తామని అన్నారు. యూపీఏ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు.