రాజ్యసభకు మన్మోహన్‌ నామినేషన్‌

న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) :
రాజ్యసభ అభ్యర్థిగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రధాని పదవీ కాలం జూన్‌ 16న ముగియనుంది. దీంతో ఆయన అస్సాంలోను గువాహటిరాజ్యసభ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. మన్మోహన్‌ నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుంచే ఎగువసభలో ప్రాతినిథ్యం వహించారు. తాజాగా ఐదోసారి ఎన్నిక కోసం బరిలో దిగారు. అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి డిస్పూర్‌ చేరుకున్న మన్మోహన్‌.. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. జూన్‌ 16న ప్రధానితో పాటు అసోం గణపరిషత్‌ నేత కుమార్‌ దీపక్‌దాస్‌ రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. జూన్‌లో ఖాళీ కానున్న ఈ రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్‌ వెలువడింది. నామినేషన్ల దాఖలు మే 20 తుది గడువు. తర్వాతి రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుందని.. ఎన్నిక అనివార్యమైతే, మే 30న ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.