రాజ్యాంగానైనా సవరించండి
తెలంగాణ ఏర్పాటు చేయండి
తెలంగాణ సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం
సురవరం సుధాకర్‌రెడ్డి
హోరెత్తిన ఓ(పో)రుగల్లు.. ఆట్టుకున్న ఎర్రదండు కవాతు
ముగిసిన తెలంగాణ ప్రజాపోరు
వరంగల్, సెప్టెంబర్ 3 (జనంసాక్షి)
తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యాంగపరమైన సమస్యలుంటే అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించైనా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ కోసం రోడ్డు మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నాయకత్వంలో గత పది రోజులుగా తెలంగాణ జిల్లాలలో సాగిన ప్రజాపోరుయాత్ర సోమవారం నగరానికి చేరుకున్న సందర్భంగా హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యాత్ర ముగింపు బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అధ్యక్షత వహించగా, సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మాణం కావాలని కేంద్రం భావిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ శాసనసభ్యులున్న సీమాంధ్ర ప్రాంతం వారు వ్యతిరేకిస్తారని, ఏకాభిప్రాయం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించైనా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో 800 మంది విద్యార్థులు ఆత్మార్పణం చేసుకున్నారని, రాష్ట్రం రాదనే బాధ, ఆవేదనలోనే ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, ఉద్యోగుల సమ్మె, 45 రోజుల సకల జనుల సమ్మె జరిపి తమ ఆకాంక్షను తెలిపారని అన్నారు. ఇంతటి బ్రహ్మండమైన ఉద్యమాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం అత్యంత దారుణమైన, అమానవీయమైన విషయమని అన్నారు. ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది రక్తతర్పణం చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత సిపిఐది అని, ఆనాడే ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తే తెలుగు ప్రజలందరూ సమైక్యంగా ఉండి సాంస్కృతికంగా, అభివృద్ధిపరంగా ముందుకు సాగాలని తాము విశాలాంధ్ర ఏర్పాటుకు నినదించామని చెప్పారు. తెలంగాణ కోసం జరుగుతున్న వివక్షను నిలువరించాలని చేపట్టిన ఆరు సూత్రాల పథకం, ప్రాంతీయ మండలి పెట్టినా ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భంగా సడలించారని అన్నారు. తెలంగాణ వెనుకబాటుతనంపై తాము ఎప్పటికప్పుడు లోక్‌సభా, అసెంబ్లీలో తెలంగాణకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆందోళన చేపట్టిందని, 2000 సంవత్సరంలో సిపిఐ వరంగల్‌లో సభ పెట్టి వరంగల్ డిక్లరేషన్ విడుదల చేసినా పాలకులు పెడచెవిన పెట్టారని, అందుకే సమైక్య రాష్ట్రం ఉండాలన్న సిపిఐ తెలంగాణకు జరిగే అన్యాయాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రానికై డిమాండ్ చేసిందన్నారు. గతంలో తమ శాసన సభ పక్షనేతగా ఉన్న చాడా వెంకట్ రెడ్డి తెలంగాణలో వసూలయ్యే నిధులను అడిగితే రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా చేసి సీమ, ఆంధ్రా, తెలంగాణ, హైదరాబాద్‌గా విభజించి హైదరాబాద్‌ను మరో ప్రాంతంగా చూపి ప్రభుత్వం మోసపూరిత పద్దతులను అవలంబించిందన్నారు. తాము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నా ఇతర ప్రాంతాలకు వ్యతిరేకం కాదని, సోదరులుగా విడిపోవాలని సిపిఐ కోరుకుంటున్నదన్నారు. ఏవైనా సమస్యలు వస్తే దేశంలో తెలంగాణ అంతర్భాగంగానే ఉంటుంది కాబట్టి కేంద్రం, కోర్టులు, ట్రిబ్యూనల్‌ల ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకునేందుకు తెలంగాణ అనుకూలశక్తులు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. కోస్తాంధ్ర, సీమ నేతలు ఇక్కడి ప్రజలు ఆకాంక్షలను గౌరవించి అర్థం చేసుకోవాలని, అందరూ మద్దతు ఇవ్వడం ద్వారా సమస్యలు పరిష్కరించాలని సురవరం సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ తెలంగాణలో జరిపిన తన పోరు యాత్రకు జనం మద్దతును చూసే కాంగ్రెస్ మంత్రులు తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు తాను ఉనికి కోసమే విమర్శలు చేస్తున్నారని అన్నారని, 2014లో కాంగ్రెస్ పార్టీయే మాయమై పోతుందని చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణంగా కాంగ్రెస్ నేతలేనని, జైలులో పెట్టాల్సింది వారినే తప్ప తామెందుకు క్షమాపణ చెబుతామని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి మృతదేహంపై ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు, మంత్రులు మాట తప్పారంటే స్మశానంలో బొగ్గులేరుకునే వారి కిందె లెక్కా అని చెప్పారు. తెలంగాణలో ఇక్కడి ఎంపిలు జై తెలంగాణ అంటుంటే సీమాంధ్రలో సమైక్యమని చెబుతున్నారని, ఇద్దరు కలిసి గాంధీభవన్‌లో కాపురం పెడుతున్నారని, అలాంటి కాంగ్రెస్ ఎంపిలది రాజకీయ వ్యభిచారమే అవుతుందని విమర్శించారు. తెలంగాణ సమస్యపై 23 జిల్లాల్లో ఆందోళన చేసిన ఒకే ఒక్క పార్టీ సిపిఐ అన్నారు. 2004లో సిపిఐ, టిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, కాంగ్రెస్ నేతలది నాలికా తాటి మట్టా అని ప్రశ్నించారు. సిపిఐ రాయి, రప్పలతో కలిసి ఉండే జడపదార్థం కాదని, మనుషులతో కలిసి పనిచేస్తుందని, అందుకే వారి ఆకాంక్షను గౌరవిస్తుందని చెప్పారు. తెలంగాణపై ముద్దాయి కేంద్రప్రభుత్వమేనని, అణుఒప్పందాన్ని మెజార్టీ లేకున్నా నెగ్గించుకుందని, అందుకు ఓటేసి ఆదికేశవులుకు ప్రపంచంలో ఆధ్యాత్మిక దైవమైన వెంకటేశ్వరున్ని అమ్ముకున్నారని విమర్శించారు. తెలంగాణ దోపిడికి గురికాకుండా బయ్యారం లాంటి గనులను అసెంబ్లీని స్థంబింపచేసి, ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బంద్ పాటించి రక్షించామని, సంపదతో కూడిన తెలంగాణ కోసం సిపిఐ ఉద్యమిస్తున్నదని, టిఆర్‌ఎస్ కూడా ఇందుకు కలిసి రావాలని కోరారు. ఈ బహిరంగ సభలో సిపిఐ శాసనసభ పక్ష నేత గుండా మల్లేశ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర జేఎసి కోకన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ప్రసంగించగా, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, బానోతు చంద్రావతి, ఉజ్జిని యాదగిరి రావు, మాజీ ఎంపి అజీజ్ పాషా, ఎమ్మెల్సీలు జల్లి విల్సన్, పిజె చంద్రశేఖర్ రావు, రాష్ట్ర నేతలు పల్లా వెంకట్ రెడ్డి, కె. రామకృష్ణ, సిద్ది వెంకటేశ్వర్లు, నర్సింహారావు, విశాలాంధ్ర ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వివిధ జిల్లాల సిపిఐ కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, డి. హేమంత రావు, కె. శంకర్, భూమయ్య, ఆదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోతరాజు సారయ్య, రవీంద్రకుమార్, రాష్ట్ర సిపిఐ సీనియర్ నాయకులు మడత కాళిదాస్, టి. వెంకట్రాములు, వాసిరెడ్డి సీతారామయ్య, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు టి. సత్యం, తమ్మెర విశ్వేశ్వర్ రావు, కార్యదర్శివర్గ సభ్యులు మోతె లింగా రెడ్డి, జిల్లా జేఎసి చైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, కేయూ జేఎసి చైర్మన్ సాదు రాజేశ్, జిల్లా జేఎసి ఇంచార్జి సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, టిజిఎ రాష్ట్ర అధ్యక్షులు మర్రి యాదవరెడ్డి, టాడు అధ్యక్షులు గుడిమల్ల రవికుమార్, ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుస్రత్ మోహినోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండలో ఎర్రదండు కవాతు
కమ్యూనిస్టుల భారీ ప్రదర్శన-హన్మకొండలో బహిరంగ సభ-తరలివచ్చిన వేలాది మంది ఎర్రసైన్యం-
వరంగల్,క్రైం సెప్టెంబర్ 3 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఎర్రదండు గర్జించింది. చారిత్రక ఓరుగల్లు నగరంలో ప్రత్యేక రాష్ట్రంకై నినదించింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన సిపిఐ శ్రేణులు వరంగల్ నగరంలో కదంతొక్కారు. ములుగు రోడ్డు ఐటిఐ ప్రారగణం నుంచి హన్మకొండ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో వేలాది మంది జనం పాల్గొన్నారు. ఒక వైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా బహిరంగ సభ ముగిసే వరకు సిపిఐ కార్యకర్తలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.ప్రదర్శనలో, బహిరంగసభలో నగరంలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలు బతుమ్మలు, బోనాలు, పీరీలు చేతపట్టి డప్పు చప్పుళ్ళతో వందలాదిగా ముందుకు నడిచారు. దారి పొడవునా ప్రజానాట్య మండలి కళాకారుల నృత్యాలు, ఎర్ర చొక్క వాలంటీర్ల కావాతు నగర ప్రజలను ఆకర్షించింది. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన సిపిఐ శ్రేణులు అసాంతం తెలంగాణ నినాదాలు చేస్తూ సిపిఐ జిందాబాద్ అంటూ ముందుకు నడిచారు. సిపిఐ భారీ ప్రదర్శనతో హన్మకొండలోని ప్రధాన రహదారి ఎర్రబారింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ప్రజాపోరుయాత్ర తెలంగాణలోని జిల్లాలను చుట్టి వచ్చి వరంగల్‌కు చేరుకోగా, నారాయణ బృందానికి ఘనస్వాగతం పలికారు. తొలుత సిపిఐ పోరుయాత్ర జిల్లాలోని భూపాలపల్లి మండల కేంద్రానికి చేరుకోగా, అక్కడి సింగరేణి కార్మికులు, సిపిఐ కార్యకర్తలు ఘన స్వాగతం పలికి జిల్లాలోకి ఆహ్వానించారు. అనంతరం పాదయాత్ర రేగొండ, పరకాల, ఆత్మకూరు మండలాల మీదుగా నగరానికి చేరుకున్నది.