రామగిరి ఖిల్లా.. రాచఠీవికి ఇలాఖా

1
సహజవనరుల గుట్ట.. ఆయుర్వేదపు దిట్ట..

సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో నీలినీడ

పర్యాటక ప్రాంతంగా ఎదగాలి

దేశానికి తలమానికం కావాలి

రామగిరి ఖిల్లాపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం

ఆదో రాచఠీవి ఖిల్లా.. సహజవనరుల కల్ప తరువు.. శత్రు దుర్బేద్యం.. అన్నలకు ఆశ్రయమిచ్చిన అభయాశ్రమం.. ఆ గుట్టెక్కితే జిల్లాలే కాదు రాష్ట్రాలే దాటవచ్చు. అక్కడ భారతీయ పురాతన సంప్రదాయ ఔషధ మొక్కలకు నెలవు. ఇక్కడ ప్రతి మొక్క లభిస్తుందనీ ఓ శిలాశాసనం కూడా ఉంది. ఆ ఖిల్లా కరీంనగర్‌ జిల్లాలో ఉండడమే ఓ శాపం… పరాయి పాలకుల నిర్లక్ష్యానికి ఓ ప్రతీక.. గతంలో ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌ సీ.హెచ్‌ విద్యాసాగర్‌ రావు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేరళకు దీటుగా ఆయుర్వేద మొక్కల పరిరక్షణతో పాటు పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు నెత్తినోరు మొత్తుకున్నా చంద్రబాబు స్పందించ లేదు. తెలంగాణ సాధించాం.. స్వపరిపాలనలో సహజ వనరుల గుట్ట రామగిరి ఖిల్లా పర్యాటక ప్రాంతంగా విల్లసిల్లి దేశానికే తలమానికం కావాలని ఆశిద్దాం…

హైదరాబాద్‌,జనవరి14 (జనంసాక్షి) :మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటుల పౌరుషానికి కాపలా కాసే బలమైన దుర్గంగా కాకతీయుల పౌరుషాగ్నిగి రగిలించే రణక్షేత్రంగా ఎన్నో తరాల చారిత్రక వైభవాన్ని రామాయణ ఘట్టాల ఇతిహాసాల చిహ్నాలతో ప్రసిద్ధి చెందిన రామగిరి ఖిల్లాపై గత సీమాంధ్ర ప్రభుత్వాలు పట్టించుకోలేకపోవడం చారిత్రక పరిశోధకులను వేదిస్తోంది. ఈ రామగిరి ప్రాచీన కట్టడమేకాక, దట్టమైన ఓషధులతో అనేక రకాల వృక్ష సంపదతో శోభిల్లుతోంది. ఈ ఖిల్లాను పురావస్తుశాఖ అధికారులు సందర్శించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సంకల్పించినా ప్రయత్నాలు ఏమాత్రం సాగలేదు. ఆనాటి ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నఫ్పుడు సీ.హెచ్‌ విద్యాసాగర్‌ రావు ఈ ఖిల్లా గురించి కొంత ప్రయత్నించారు.  2013 సంవత్సరంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కరీంనగర్‌ సర్య్కూట్‌ పద్దుకింద రూ. 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆనాడు సీమాంధ్రపాలన సాగుతుండడంతో ఎవరూ ఎలాంటి ప్రతిపాదనలు పంపక పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడలా తయారైంది. ఎవరూ ఎలాంటి శ్రద్ధ చూపలేదు.  కొండగుట్టపై బలమైన దుర్గంగా కోటబురుజులతో దర్శనమిచ్చే ఈ ఖిల్లా గత వైభవాన్ని పదేపదే గుర్తుకు తెస్తుంది. దక్షిణాదిలో పెద్దకోటగా పేరున్న గోల్కొండ కోట కంటే ఈ ఖిల్లా విశాలంగా విస్తరించి ఉంది. ప్రవేశ ద్వారాలు, బురుజులు కూడా పెద్దవే. ఇక్కడ నుంచి మానేరు, గోదావరి సంగమం అద్భుతంగా కనిపిస్తుంటుంది. చుట్టూదట్టమైన అడవి వివిధరకాల ఓషధులు, పక్షులు ప్రకృతి జీవవైవిధ్యం నెలకొని ఉండడంతో పర్యాటకులకే కాదు, వైద్య, వృక్ష శాస్త్రవేత్తలకు కూడా ఎంతో విలువైన ప్రదేశంగా పేర్కొనవచ్చు. బోటనీ విద్యార్థులు ఇక్కడ అమూల్యమైన వృక్షజాతులను సేకరిస్తుంటారు. రామగిరిని విశ్రాంతి గిరి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఆ పేరుకు తగ్గట్టు ఈ ఖిల్లా పరిసరాల్లో కాసేపు సంచరిస్తే మనసు ప్రశాంతంగా ఎక్కడికో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. శిధిలమైన గోడలు, భవనాలు, బురుజులు, మసీదులు, సమాధులు, ప్రతాపరుద్రుని కోట, గుర్రాలు, ఏనుగుల స్థావరాలు, కారాగారం, భోజనశాల ఆనాటి చక్రవర్తుల రాజవైభవాలకు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. శిధిలమైన చిత్రకోట, త్రాటికోట, నిమ్మకోట, సింహాలకోెట, సోలుకోట, జండికోట, మండుకోట  నగరఖానా, ఆయుదాల గిడ్డంగులు, ఇవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. తోపుబావి, నల్లకయ్యబావి, పసరుబావి, హరిబావి, అచ్చమ్మబావి, అమ్మగారి బావి మంచినీళ్ల కోసం ఆనాటి పాలకులు తవ్వించారు. ఏడు ద్వారాలు, చౌకీలు, ఆలయాలు ఉన్నాయి. ఇతిహాస పరంగా రామాయణ సంఘటనలు కొన్ని ఈ కొండపై జరిగాయని చెబుతుంటారు. సీతారాములు స్థాపించిన శివలింగాలు, సీతాస్నానంకొలను, సీతమ్మ పసుపుకుంకుమలు రాసుకునే రాళ్లు, కూర్మ, బ్రహ్మ గుండాలు కేశవ, విఠల్‌గోవింద, హన్మదాలయాలు ఈ ఖిల్లా ప్రాంతంలోనే కనిపిస్తాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు ఉత్తర దిశ వైపున దండకారణ్యంలో  ఆనాడు అగస్త్య మహర్షి ఉండేవాడని, ఆయన ఆశ్రమానికి దక్షిణాన రెండు యోజనాల దూరంలో గోదావరి తీరాన పంచవటికి వెళ్లమని సీతారాములకు వనవాస సమయంలో చెప్పాడని అరణ్యకాండలో ఉంది. పంచవటి అంటే మర్రి, మారేడు, మేడి, రావి, అశోక వృక్షాలు ఉండే వనం అని అర్థం. ఈ ప్రదేశం గోదావరి తీరం వెంబడి కరీంనగర్‌ జిల్లా బేగంపేట గ్రామం లోని రామగిరి ఖిల్లా నుంచి ఖమ్మం జిల్లా తూర్పు సరిహద్దువరకు ఉండేది. ఇంత విశాలమైన ఈ ప్రాంతం సీతారాములను అమితంగా ఆకర్షించిందని రామాయణంలో ఉంది. చారిత్రక పరంగా పరిశీలిస్తే క్రీస్తుశకం 750-755 ప్రాంతంలో రామగిరిని వేములవాడ చాళుక్య రాజ్యస్థాపకుడు వినమాదిత్యయుద్ధమల్లుడు శత్రువుల నుంచి జయించాడు. 973 లో వేములవాడ చాళుక్య, రాష్ట్ర కూటరాజుల సామంత రాజ్యం అంతరించాక ఈరామగిరిని కరీంనగర్‌ జిల్లాలో విలీనం చేసినట్టు తెలుస్తోంది. 1657 వరకు చక్రవర్తులు ఎందరో ఈ ఖిల్లాను పరిరక్షించుకుంటూ పాలన సాగించారు. 1656లో జౌరంగజేబు కాలంలో మొఘల్‌ గవర్నరుగా ఉండే రాకుమారుడు మహమ్మద్‌ సుల్తాన్‌కు గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్షా పెద్దబిడ్డతో పెళ్లి చేసినప్పుడు రామగిరిని కట్నంగా ఇచ్చాడు. ఆ పెళ్లి జరిగిన ప్రదేశం లోనే పెండ్లిబావి అనే దిగుడు బావి బేగంపేట శివారు లో ఉంది. క్రీస్తుపూర్వం 250 ప్రాంతంలో మౌర్యులు రామగిరిని ఆక్రమించి సామ్రాజ్యాన్ని విస్తరించారు. వారి కాలంలోనే రామగిరి దుర్గం నిర్మాణమైంది. చంద్రగుప్తుడు, బిందుసారుడు పాలనలో రామగిరిని బలోపేతం చేశారు. శక్తి వంతమైన సైనిక కేంద్రంగా తీర్చిదిద్దారు. 1181లో ముచ్చనాయకుడిని కాకతీయ రాజు రుద్రమదేవుడు ఓడించి రామగిరిని జయించాడు. ఈ సంఘటన తరువాతనే కాకతీయులు రాయగజకేసరి బిరుదు పొందారు. 1181 నుంచి 1323 వరకు కాకతీయుల పాలనలోనే రామగిరి దుర్గం ఉండేది. 1323లో కాకతీయులను ఓడించి మహమ్మద్‌బీన్‌ తుగ్లక్‌ రామగిరిని కైవసం చేసుకున్నాడు. 1328లో రాచకొండ వెలమనాయకులు రామగిరిని తెలంగాణ లోని ప్రాంతీయ రాజ్యంగా చేసి పాలించారు. 1517-18,1532-33 మధ్యకాలంలో రామగిరి గురించే బీరార్‌ సుల్తానులకు కులీకుతుబ్‌షాలకు మధ్య యుద్ధాలు జరిగాయి. 1532-33 ప్రాంతంలో మొదటిసారి రామగిరి కోటపైకి కులీకుతుబ్‌షా ఫిరంగిగుండ్లను ప్రయోగించాడు.  ఇన్ని ప్రాశస్త్యాలు కలిగిన రామగిరిని విస్శరించడం మన చారిత్రక సాక్ష్యాలను మనం నాశనం చేసుకున్నట్టే. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రామగిరిని పర్యాటక ప్రాంతంగా చారిత్రక ప్రదేశంగా ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం అవసరం.