రాములోరి పెళ్లికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం
భద్రాచలం, ఏప్రిల్ 19 (జనంసాక్షి) :
రాములోరి పెళ్లికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిజాం వారసత్వాన్ని కొనసాగించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రుల కల్యాణ మ¬త్సవం అత్యంత వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తుల రామ నామస్మరణతో భద్రాద్రి పులకించిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నాన వేద మంత్రోచ్ఛరణల మధ్య, భక్తుల నీరాజనాల నడుమ సీతారాముల వారికి వేద పండితులు మాంగల్యధారణ చేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించి ఆదర్శ దంపతులకు మత్యాల హారాలు సమర్పించారు. అంతకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాములోరి కల్యాణాన్ని స్వయంగా వీక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. సీతారాముల కల్యాణ ఘట్టాన్ని కనులారా గాంచేందుకు వచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం నిండిపోయింది. వేద మంత్రోచ్ఛరణలతో భద్రాద్రి పరమపావనం చెందింది.
నీలిమేఘ శ్యాముడి కల్యాణ మ¬త్సవం శుక్రవారం భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారు సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేశారు. అంతుకు ముందు రామయ్య దేవాలయంలో వధూవరులు జానకీరాములకు ప్రత్యేకపూజలు నిర్వహించి, మిథిలా స్టేడియానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉదయం 8 గంటల సమయంలో ఆలయంలో వేద పండితులు రాముడికి ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించారు. అలంకరణ క్రతువు పూర్తి చేసిన అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. 10.30 గంటలకు స్టేడియానికి చేరుకున్న వధూవరులకు వేద పండితులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికి వివాహ క్రతువును ప్రారంభించారు. తిరు కల్యాణానికి సంకల్పం చేసి సర్వ విజ్ఞాన శాంతికి విష్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం మంత్ర పూజలతో కల్యాణానికి వినియోగించే వస్తు సామగ్రికి ప్రోక్షణ చేసి, రక్షాబంధనం చేశారు. 24 అంగులాల పొడవైన 12 దర్భలతో అల్లిన తాడును సీతమ్మకు ధారణ చేశారు. రామయ్య కుడి చేతికి, జానకి ఎడమ చేతికి రక్షాసూత్రాలు కట్టి, సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. అనంతరం తాంబూలాది సత్కారాలు చేసి, కన్యావరణం చేశారు. కులగోత్రాల పఠనానంతరం శ్రీరామస్వామి పాదాలకు ప్రక్షాళన చేశారు. పరిమళ భరితమైన తీర్థం మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయించారు. అనంతరం ప్రభుత్వం తరఫున సమర్పించిన పట్టు వస్త్రాలను స్వామివార్లకు అలంకరించిన వేద పండితులు మంత్రోచ్ఛరణలు పఠిస్తూ కన్యాదానం జరిపించారు. అభిజిత్ లగ్నం సవిూపించగానే, మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛరణల మధ్య జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామి వారితో సీతాదేవి తలపై, సీతాదేవితో స్వామి వారి శిరస్సుపై జీలకర్రబెల్లం పెట్టించారు. సీతారాములకు మాంగల్యధారణ చేయించారు. జగదాబిరాముడు, జానకీలకు ముత్యాల తలంబ్రాలు పోయడంతో పాటు సీతారామచంద్రులకు ముత్యాల హారాలు సమర్పించారు. బ్రహ్మముడి వేసిన అనంతరం వేద పండితులు చతుర్వేదాలతో నూతన దంపతులకు ఆశీర్వచనాలు పలికి కల్యాణ క్రతువులో తుది అంకాన్ని పూర్తి చేశారు.
రాములోరికి శ్రీవారి కానుకలు..
భద్రాద్రి శ్రీరాముడికి తిరుమల శ్రీవారు పంపిన కానుకలను వేద పండితులు స్వామి వారికి సమర్పించారు. సీతారాముల కల్యాణ మ¬త్సవం సందర్భంగా తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. టీటీడీ తరఫున స్వామి వారికి శ్రీవారి కానుకలను టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు సమర్పించారు.
తరలివచ్చిన ప్రముఖులు..
జగదాభిరాముడి కల్యాణ మ¬త్సవాన్ని తిలకించేందుకు రాజకీయ నాయకులు, ప్రముఖులు భద్రాద్రికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, సి.రామచంద్రయ్య, పితాని సత్యనారాయణ, పి.బాలరాజు, రాంరెడ్డి వెంకటరెడ్డి సహా 11 మంది మంత్రులు స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్టాల్ర నుంచి భక్తజనం తరలివచ్చారు. ప్రముఖుల రాకతో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.