రాష్టాన్రికి బిజెపి చేస్తున్నదేమిటి?

కేంద్రంలో అధికారంలో బిజెపి ఉన్నా రాష్ట్రంలో ఎదగడానికి కావాల్సిన హంగులు పొందలేకపోతున్నది. రాష్ట్రనాయకత్వం కూడా కేవలం టిఆర్‌ఎస్‌ వ్యతిరేకతపైనే పోరాడుతోందే తప్ప రాష్టాన్రికి నిధులు సమకూర్చుకుని అభివృద్ది చేసుకుందామన్న సోయి ప్రదర్శించడం లేదు. అసెంబ్లీకి వరికంకుల ప్రదర్శనతో వచ్చిన బిజెపి నాయకలును చూస్తుంటే జాలి కలుగుతోంది. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉండగా ఎపికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చే పనులు చేసిపెట్టారు. అదే దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నా సొంతపనులు చూసుకుని, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేశారు తప్ప రాష్ట్రంకోసం చేసింది శూన్యం. ఎయిమ్స్‌ ఇస్తామని హావిూ ఇచ్చినా దాని ఊసే లేదు. అలాగే మూడున్నరేళ్లు దాటినా హైకోర్టు విభజన జరలేదు. అలాగే ఉద్యోగుల విభజన ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కృష్ణానీటి పంపకాలపై కొట్లాటలు ఆగడం లేదు. ఇవన్నీ కేంద్రం చేయాల్సిన పనులు. రాష్ట్ర నాయకులు స్థానిక టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో కలసి వీటిపై పోరాడివుంటే బిజెపికి పేరు వచ్చేది. ప్రజల్లో ప్రతిష్ట పెరిగేది. కానీ అలా జరగడం లేదు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగిస్తే నోరుమూసుకుని కూర్చోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇక్కడ పార్టీలోకి నేతలను ఆకర్శించే రీతిలో పనులు జరగడం లేదు. అందుకే స్తబ్దుగా బిజెపి రాజకీయాలు సాగుతున్నాయి. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో దత్తాత్రేయ కేవలం తనచుట్టూ ఉన్న కొందరు కోటరీ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండి వారు చెప్పిన పనులనే చేస్తున్నారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. పైరవీలకు దత్తాత్రేయ అనుచరులు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు బహిరంగ రహస్యం. అందుకే బిజెపి అంటే ప్రజల్లో ప్రభావం లేకుండా పోయింది. ఆయనను తొలగించినా స్పందన లేకుండా పోయింది. ఇలా ప్రజలకు చేరువ కావడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా, కేంద్రంలో మాట్లాడి రాష్టాన్రికి మేలు జరిగే పనులు చేయకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్న తీరు చూస్తుంటే నవ్వు పుట్టిస్తోంది. కేవలం నలుగురు కలసి రోడ్డువిూద ఆందోళన చేయడం వల్ల లాభం లేదని గుర్తించాలి. అలాగే రైతుల గురించి మాట్లాడుతున్న వారు ఈ-నామ్‌ ఎందుకు ఫెయిల్‌ అయ్యిందో గుర్తించలేకపోతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఎందుకు అందించలేక పోతున్నా రో చెప్పలేకపోతున్నారు. కేంద్రంలో మోడీ ఆనాడు గుజరాత్‌ నమూనా అంటూ అధికారం సొంతం చేసుకున్న బిజెపి తెలంగాణలో మాత్రం తన పట్టును నిరూపించుకోవడం లేదు. గత ఎన్నికలో టిడిపితో జతకట్టి కేవలం ఒక్క పార్లమెంటు, ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసు కుంది. అందులో ఓ స్థానంలో ఉన్న గోషామహల్‌ ఎమ్మెల్యే పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. నిజానికి ఈ మూడున్న రేళ్లలో బిజెపి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అధికార టిఆర్‌ఎస్‌ను ధోరణి తప్ప మరోటి వారి ఎజెండాలో లేకుండా పోయింది. ప్రధాని స్వయంగా ప్రతిపాదించి ప్రచారం చేసిన స్వచ్ఛభారత్‌ అభాసు పాలవుతోంది. బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా రాష్ట్ర నేతలు మాత్రం తమ కార్యాచరణను ప్రకటించడం లేదు. పొలిటికల్‌ గ్యాప్‌ను క్యాష్‌ చేసుకోవడంలో కాషాయదళం విఫలం అవుతుందనడానికి ఇంతకన్నా రుజువులు అక్కర్లేదు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పార్టీకి కావాల్సిన అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయినా నాయకత్వంలో ఎక్కడో లోపం కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్‌తో సమానంగా పోరాడి, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించినా ఇప్పుడుక్రెడిట్‌ అంతా కెసిఆర్‌ కొట్టేసినా దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం లేదు. వీరు సత్తా చాటి కనీసం హైకోర్టు విభజన చేయించినా ఆ క్రెడిట్‌

బిజెపి ఖాతాలో పడేది. దగ్గరుండి ఉద్యోగుల విభజన చేయించినా ఆ ఖ్యాతి వీరికి దక్కేది. ఇస్తామన్న ఎయిమ్స్‌ను సాధించినా బిజెపి గ్రాఫ్‌ పెరిగేది. ఎపిలో నేతలు పట్టుబట్టి ఇప్పుడు ప్యాకేజీలు, ఆర్థిక సాయాలు, వివిధ సంస్థలు తెచ్చుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో బలాన్ని చాటారు. అయితే తెలంగాణకు ఇస్తామన్న ఎయిమ్స్‌ను సాధించే సత్తా కూడా ఇక్కడి బిజెపి నేతలకు లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం అధికారకంగా తెలంగాణ విమోచన జరపాలన్న డిమాండ్‌తో ఏటా చేపట్టే యాత్రల తో ప్రజలను మభ్య పెడుతున్నారు. దీంతో ప్రజలకు ఒరిగేదేవిూ లేదు. కేంద్రానికి రాష్టాన్రికి అనుసంధానం గా ఉండి సమస్యలను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారు. నిజంగా చెప్పాలంటే చేతగాకుండా మిన్నకుండి పోయారు. హైకోర్టునే తీసుకుంటే దానిని విభజన చేయించే దమ్ము ధైర్యం కూడా ఈ నేతలకు లేదని చెప్పడంలో సందేహించాల్సిన అవసరం లేదు. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా మైలేజిని సొంతం చేసుకోవడంలో వచ్చిన అవకాశాలను వినయోగించుకోవడంలో బిజెపి నేతలు విఫలం అవుతున్నారు. టిడిపితో పొత్తు ఉండడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని పైకి చెబుతున్నప్పటకి వాస్తవానికి పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో స్థానిక నేతలు దారుణంగా విఫలమవుతున్నారు. సిద్దాంతాల ప్రాతిపాదికన రాజకీయాలు చేసే పార్టీగా గుర్తింపు ఉన్న బిజెపి తెలంగాణలో ఎందుకు ఎదగలేక పోతుందన్న చర్చ చేయడం లేదు. కేవలం మోడీని చూపి బ్రహ్మాండం అంటూ అవినీతి రహిత పాలన అందిస్తున్నామని అంటూ చంకలు గుద్దుకుంటే బిజెపిని ప్రజలు ఆదరిస్తారనుకుంటే పొరపాటుకాక మరోటి కాదు. ప్రజలకోసం ముఖ్యంగా తెలంగాణ కోసం ఏం చేశామో అన్నది సవిూక్షించుకుంటే తప్ప ప్రజలు ఆదరించరని గుర్తుంచు కోవాలి.