రాష్టావ్రతరణ వేడుకలకు చురుకుగా ఏర్పాట్లు
కరీంనగర్,మే31: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు వారం పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో ఏర్పాట్లను కలెక్టర్ నీతూప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. అమరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను ఆరోజే అందించనున్నారు. వేడుకల సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని అవిష్కరించనున్నారు. అవతరణ వేడుకల సందర్బంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి నగదు అవార్డులను మండల, నగర పంచాయతీ, మునిసిపాలిటీ, నగరపాలక, జిల్లాస్థాయిలలో ఎక్కడి వారికక్కడే అవార్డులు ప్రదానం చేయాలని సూచించారు. 2న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి బాణసంచా పేల్చి వేడుకలను ఘనంగా ప్రారంభించాలని సూచించారు.జూన్ 2న జిల్లా కేంద్రంలో ఉదయం 9 గంటలకు సంబంధిత మంత్రిచే పతాకావిష్కరణ పోలీస్ కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ ఉంటుంది. తెలంగాణ సాంస్కృతిక సారథి జైత్రయాత్రలు అన్ని జిల్లాల్లో నిర్ణయించిన తేదీల్లో నిర్వహించాలని అన్నారు. పాటల సీడీలు, తెలంగాణ పత్రికలు జిల్లాలకు పంపుతామని, వాటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపించాలని అన్నారు. సీడీలను వారం పాటు గ్రామ పంచాయతీల్లో వినిపించాలని అన్నారు. వేడుకల సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీటి సౌకర్యం కల్పించాలని, షామియానాలు వేయించాలని అన్నారు. అన్ని గ్రామాలలో జూన్ 2 నుంచి 7 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లోని ప్రజలు, యువతీ, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘ సభ్యులు, జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని పండగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ 2న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని అవిష్కరించాలని, ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించాలని, క్విజ్, ఆటల పోటీలు, వక్తృత్వ పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించాలని కోరారు.