రాష్ట్రంలో విద్యుత్ కోతలు
పులికల్ దళితవాడే ఇందుకు నిదర్శనం
వ్యవసాయానికి గడ్డు కాలం: కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుల తరబడి కరెంట్ ఉండడం లేదు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవని, అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కరెంట్ కోతలపై ప్రభుత్వం అబద్దాలాడుతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం పులికల్ గ్రామంలోని దళిత వాడలో గత వారం రోజులుగా కరెంట్ లేదు. దళిత కుటుంబాలన్నీ చీకట్లోనే ఉంటున్నాయి. గ్రామంలోని ఇతర బీసీ కాలనీల్లో కరెంట్ ఉన్నప్పటికీ, దళిత వాడలో మాత్రం కరెంట్ లేదు. విషయంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దళిత వాడలో వారం రోజులుగా కరెంట్ లేదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జర చూడండి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దళిత వాడ ప్రజలు గ్రామ సర్పంచ్‌తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మాదిగలంటే ప్రభుత్వానికి ఇంత చిన్నచూపా..? అని నిలదీస్తున్నారు. బీసీ కాలనీల్లో కరెంట్ ఉంది. సర్పంచ్ కూడా మా కాలనీకి రావడం లేదు. ఇప్పటికే అధికారులను అడిగాం.. కానీ పట్టించుకోవడం లేదు.. కరెంట్ లేకపోవడంతో కాలనీలోకి పాములు వచ్చినా కనిపించడం లేదని, ఇప్పుడే ఒక పామును చంపామని దళితులు వాపోయారు.
కాంగ్రెస్‌పాలనతో వ్యవసాయానికి గడ్డు కాలం: కేటీఆర్
కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగమని.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని… ఇదే ఆగమవుతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతమని పేర్కొన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు. మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్.. నేడు సాగయ్యే భూవిస్తీర్ణం కట్ అని ఎద్దేవా చేశారు.’’రుణమాఫీ పేరుతో మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు. బురద రాజకీయాలు తప్ప… కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదు. అప్పుల బాధతో అన్నదాతలు, కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ తెలంగాణలో సాగువిస్తీర్ణం తగ్గడానికి కారణాలు’’ అని కేటీఆర్ విమర్శించారు.