రాష్ట్రాన్ని సీఎం పాలిస్తుండా ! డీజీపీ పాలిస్తుండా ?
మంత్రులతో చర్చలు జరుగుతుంటే పోలీస్
బాస్ ప్రకటనేంది ?
కిరణ్ వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు
రెచ్చగొట్టేలా ఉన్నయ్ : పొన్నం ఫైర్
హైదరాబాద్ , సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : రాష్ట్రాన్ని ప్రభుత్వం పాలిస్తున్నదా.. డీజీపీ పాలిస్తున్నడా అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన విమర్శిం చారు. సీఎం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీని సమన్వయం చేయాల్సిన సీఎం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్య మంత్రి పదవికి సీఎం అనర్హుడని వ్యాఖ్యానిం చారు. తెలంగాణ మంత్రులతో సమావేశం జరుగుతున్న సమయంలోనే డీజీపీ ప్రకటన ఇవ్వడంపై తీవ్రంగా స్పందించిన ఆయన, తోటి మంత్రుల గౌరవం కాపాడలేరా అంటూ పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులకు సీఎంపై విశ్వాసం లేదని, అసలు ఇంత జరుగుతోంటే తెలంగాణ మంత్రులను పిలిచి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీని ధిక్కరించే వారి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారి మాటలను అధిష్టానం నమ్మడం దురదృష్టకరమని పొన్నం అన్నారు. సీఎంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అన్న, తెలంగాణ మంత్రులన్నా సీఎంకు గౌరవం లేదని పొన్నం అన్నారు. జేఏసి నేతలను పిలిచి సీఎం మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయటం లేదని పొన్నం చెప్పారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా జేఏసి సూచనలను ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలుగకుండా కవాతుకు అనుమతివ్వాలని పొన్నం డిమాండ్ చేశారు.