రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లేసమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి!

టీడీపీ నేత రేవంతరెడ్డి
హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : హరితాంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి ఆరోపించారు. శనివారంనాడు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధత వల్ల రాష్ట్ర ప్రజలు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ రాష్ట్రానికి కాటికాపరిలా ఉన్నాడని విమర్శిం చారు. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. విద్యుత్‌ కోతతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తీసుకున్న రచ్చబండలో తీసుకున్న విజ్ఞాపన పత్రాలను చెత్తబుట్టలో దాఖలు చేశారని ఆరోపించారు. రచ్చబండ సమస్యలే ఇంకా పరిష్కారం కాలేదని, ఇందిరబాట కార్యక్రమం ముఖ్యమంత్రి ఎందుకు చేపట్టారని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ బాట.. ఇంటి బాటగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రిని నిలదీయాలని రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తన ఉనికిని చాటుకునేందుకే కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. ఆ పథకాలు అమలుకు నోచుకోబోవని రేవంతరెడ్డి అన్నారు. ముఖ్యంగా తెలంగాణపై కెసిఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ప్రతి పండుగకు తెలంగాణ వస్తుందని.. కెసిఆర్‌ ప్రకటించడం.. ఆయనకు ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌ చేసే సైగలు తమకు అర్ధం కావడం లేదని అన్నారు. కెసిఆర్‌ కాంగ్రెస్‌తో కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి రంగు బయటపడుతుందని అన్నారు. జైలులో ఉన్న జగన్‌ బెయిల్‌ పొందేందుకే రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ప్రకటిస్తున్నారని అన్నారు.