రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అంకతి వెంకన్న
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ -2 ప్రధానోపాధ్యాయులు అంకతి వెంకన్న 2022 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు.1996లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన 2002లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ గా పదోన్నతి పొంది, రెండు దశాబ్దాలుగా వివిధ పాఠశాలల్లో సైన్స్ బోధనలో విభిన్న మెలకువలతో విద్యార్థులకు ప్రయోగాల ద్వారా సులభ పద్ధతిలో సైన్స్ నేర్పడంలో తనదైన ముద్ర వేసుకున్నారు.అదేవిధంగా అనేక ఉపాధ్యాయ ట్రైనింగ్ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించి , విషయ సంబంధిత కరదీపిక తయారీలో కీలక భూమిక పోషించారు.పాఠశాల స్థాయి, జిల్లాస్థాయిలోనూ పలుమార్లు సైన్స్ మేళాలు, సైన్స్ ఫెయిర్స్ నిర్వహించారు.వీటితో పాటు పాఠశాలలో దాతల సహాయంతో మంచినీటి వసతి కొరకు మినరల్ వాటర్ ప్లాంట్, బోధన కొరకు ఎల్ఈడీ టీవీ వంటి భౌతిక వనరులు సమకూర్చుటకు విశేష కృషి చేశారు. ప్రతి సంవత్సరం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పొందే విధంగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు.సూర్యాపేట జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు జీఎస్ఎల్వీ మోడల్ ను ప్రదర్శించారు.ఉపాధ్యాయ వృత్తితోపాటు జన విజ్ఞాన వేదిక, విజ్ఞాన భారతి, అన్వేషిక వంటి, పలు శాస్త్ర విజ్ఞాన ప్రచార సంస్థలతో పనిచేసి విజ్ఞాన శాస్త్రాన్ని జనాభాహుల్యంలోకి తీసుకువెళ్లడంలోనూ కృషి చేస్తున్నారు.రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికైన వెంకన్నను డీఈఓ అశోక్ , ఎడి శైలజ, జిల్లా కోఆర్డినేటర్లు, ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు రామలింగారెడ్డి, రమేష్ బాబు, గురుమూర్తి, జాఫర్, లింగమూర్తి తదితరులు అభినందించారు.