రాహుల్‌కు లీగల్‌ నోటీస్‌

రూ.500 కోట్లు పరిహారం చెల్లించాలని ఏజీపీ దావా
న్యూఢల్లీి, జూన్‌ 6 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అస్సాం గణపరిషత్‌ (ఏఎస్‌జీ) పరువు నష్టం కింద రూ.500 కోట్ల లీగల్‌ నోటీసు పంపింది. ఏజీపీ అధికారంలోకి రావడానికి తిరుగుబాటుదారుల సాయం తీసుకుందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించింది. రాహుల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని 15 రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఏజీపీ యువజన విభాగం గడువు విధించింది. అసోంలో ఏజీపీ అధికారంలోకి రావడానికి తిరుగుబాటుదారుల సాయం తీసుకుందని రాహుల్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. విదేశీయులకు వ్యతిరేకంగా ఏజీపీ తిరుగుబాటుదారులతో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఏజీపీ యువజన విభాగం అధ్యక్షుడు కిషోర్‌ ఉపాధ్యాయ రాహుల్‌కు లీగల్‌ నోటీసు పంపించారు. అనుచిత వ్యాఖ్యలు చేసి తమ పార్టీ పరువుకు భంగం కలిగించారని, 15 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని పేర్కొన్నారు. తమ నోటీసుపై స్పందించకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, రాహుల్‌ వ్యాఖ్యలను ఏజీపీ అధ్యక్షుడు ప్రఫుల్లా కుమార్‌ మహంతా తీవ్రంగా ఖండిరచారు. ఆయన వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకొనేందుకు నిపుణులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.