రూ.53 వేల కోట్లతో ప్రణాళిక వ్యయం

ఏపీ సృజనాత్మక పథకాలు : అహ్లువాలియా
న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళిక వ్యయం రూ.53 వేల కోట్లతో రూపొందించామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారయణరెడ్డి సహా 18 శాఖల అధికారులు అహ్లువాలియాతో భేటీ అయ్యారు. 2013-14 సంవత్సరానికి రూ.53 వేల కోట్ల వార్షిక ప్రణాళిక ఖరారు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ, సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆదర్శప్రాయమైనవని అహ్లువాలియా అభినందించారు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ ప్రణాళిక గురించి సీఎం కిరణ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పథకాల అమలు తీరును పరిశీలించాక దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అహ్లువాలియా చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి, రహదారుల విస్తరణపై రాష్ట్రం అత్యధికంగా దృష్టిపెట్టాలని అహ్లువాలియా సూచించారు. ఈ సందర్భంగా అహ్లువాలియా మాట్లాడుతూ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమల్లో సొమ్ము దుర్వినియోగం కాదని తెలిపారు. నగదు బదిలీని వ్యవస్థీకృతంగా జరపొచ్చని, లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేప్పుడు ఆ సొమ్ము వృథా కావడమో లేదా తప్పుడు పనులకు ఉపయోగపడటమో జరగదన్నారు.