రెండు కళ్ల బాబుకు మరోషాక్‌

కారెక్కనున్న కడియం
రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కంటే.. కనిపెంచిన తెలంగాణే ముఖ్యం : కడియం శ్రీహరి
వరంగల్‌, మే 11 (జనంసాక్షి) :
రెండు కళ్ల బాబుకు మరో షాక్‌ తగిలింది. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నేత కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పంపారు. తెలంగాణ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి మరో సీనియర్‌ నేత పార్టీకి గడ్‌బై చెప్పడంతో ఈ ప్రాంతంలో ఆ పార్టీ పరిస్థితి పెనంలోంచి పొయిలో పడిన చందంగా మారింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు తనకు రెండు కళ్లలాంటివన్న బాబు మాటలను ఇరు ప్రాంతాల నేతలు విస్మరించడం లేదు. ఇరు ప్రాంతాల్లో మెరుగైన పరిస్థితి ఉన్న పార్టీలోకి జంప్‌ చేసి తమ రాజకీయ జీవితాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ తెలంగాణపై స్పష్టమైన విధానాలు పాటించడం లేదని చెప్తూ సీనియర్‌ నేత కడియం పార్టీకి గుడ్‌బై చెప్పారు. శనివారం ఉదయాన్నే ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను బాబుకు ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకొని కారెక్కడం ఖాయమే. అయితే ఒకటి రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరేది తెలియజేస్తానన్నారు. ఇప్పటికిప్పుడైతే టిఆర్‌ఎస, బిజెపి నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు. టిడిపిలో గత కొంతకాలంగా తగిన గుర్తింపు లేకపోవడం తనకు బాధను కలిగించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో టిడిపి స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో తానీ నిర్ణయం తీసుకున్నానన్నారు. కాంగ్రెస్‌తో టిడిపి కుమ్ముక్కై పోయిందనే భావనను తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో టిడిపి సహకరిస్తుందని అకుంటున్నారన్నారు. దీనిపై బాబుకు స్వయంగా చెప్పినా కూడా పట్టించుకోక పోవడంతో తెలుగుదేశంలో ఎందుకు కొనసాగాలనే అంశం వేధిస్తూ వచ్చిందన్నారు. తెలంగాణాకోసం ప్రజా ఉద్యమంలో ఉండి పోరాటం చేయకపోతే భవిష్య’ ఉండదనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నానన్నారు. తెలంగాణాకోసం పోరాడడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుని ముందుకు సాగుతానన్నారు. రెండు ప్రాంతాలు రెండు కళ్లలాంటివని చంద్రబాబు చెప్పినప్పుడే తనకు బాద కలిగించిందన్నారు. ఆయన ఈమాట చెప్పినప్పుడల్లా తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యానన్నారు. టిడిపి తెలంగాణాలో పూర్తి విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొనక పోవడం బాధ కలిగించిందన్నారు. పదవులను అమ్ముకుంటున్నారనే భావన ప్రతిఒక్కరిలో ఉందన్నారు. డబ్బున్న వారికి మాత్రమే టిడిపిలో ప్రాధాన్యత ఉందన్నారు. 1999 నుంచి నాయకత్వం మార్పుకోసం ప్రయత్నించానన్నారు. క్రమశిక్షణ ఉల్లంగించిన వారిపై చర్యలుతీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పార్టీ నాయకత్వంలో సమన్వయం లేదు. పదవులు అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగుదేశం పార్టీ తనకు అన్యాయం చేయలేదన్నారు. పారిశ్రామిక వేత్తలకు, డబ్బులకు వచ్చేవారికి ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. పార్టీలు మారేవారికి అవకాశాలు ఇస్తున్నారన్నారు. గతవారం చంద్రబాబును కలిసినప్పుడు కూడా తనకున్న అనుమానాలను నివృత్తి చేయలేక పోయారన్నారు. తెలంగాణాకోసం సానుకూలంగా లేకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేసినట్లు కడియం శ్రీహరి పేర్కొన్నారు. అయితే బిజెపి, టిఆర్‌ఎస్‌ల నుంచి స్పష్టమైన ఆహ్వానం ఉన్నప్పటికి కడియం మాత్రం టిఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపనున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కడియం పార్టీ మారాలని భావించినా చంద్రబాబు వారించడంతో మార్పు వస్తుందని భావించానన్నారు. అయితే సీమాంధ్రుల ఒత్తిడితో బాబు తెలంగాణకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాట వేత ధోరణిని అవలంబిస్తుండడంతో తీవ్రంగా మనోవేధనకు గురయ్యానన్నారు. బాబు సూచన మేరకు కడియంతో మాట్లాడేందుకు పలువురు సీనియం నాయకులు రంగంలోకి దిగారు. అయితే కడియం మాత్రం తాను ఎవరు మాట్లాడినా కూడా వినేది లేదన్నారు. నేడు, రేపు కూడా వరంగల్‌లోనే ఉంటున్నానన్నారు. తానెక్కడికి వెల్లడంలేదన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ కంటే.. కనిపెంచిన తెలంగాణే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.