రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు
(బుధవారం తరువాయి భాగం)
‘పెట్టుబడి దారీ విధానం కాదు, అర్థభూస్వామ్య, అర్థవలస సమాజమే’
– భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారీ సమాజానికి పరివర్తన జరగబోతూ అనేక చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక కారణాల వల్ల ఆ పరివర్తన అడ్డుకోబడినపుడు, వక్రీకరించబడినపుడు మిగిలే స్థితి అర్థభూస్వామ్య, అర్థవలస వ్యవస్థ.
– అలా అడ్డుకోబడిన, వక్రీకరించబడిన పరివర్తనకు నాయకత్వం వహిస్తున్నదెవరు. ఆ పరిణామయం వల్ల నష్టపోతున్నదెవరు అనే అంచనా వర్గపోరాటానికి అవసరం.
– అర్ధవలస, అర్థభూస్వామ్య విశ్లేషణను కేవలం ఆర్థిక కోణంలో చూస్తే సరిపోదు. అది సరైన మార్క్సిస్టు సంవిధానం కూడ కాదు. ఆ విశ్లేషణకు చారిత్రక, రాజకీయ, సామాజిక కోణాలన్నీ కావాలి. సాహిత్యం వంటి సామాజిక చైతన్య రూపాల, ఉపరితల కోణాఇలను కూడ కలపాలి.
– వర్గపోరాట ఆచరణతో సంబంధంలేని ఉత్పత్తి విధాన చర్చ అనవసరం మాత్రమే కాదు, విచ్చిన్నకరం కూడ.
– వలసగా ఉండడం అనే చారిత్రక ప్రత్యేకత, కులం అనే సామాజిక ప్రత్యేకత, అంతర్గతంగా అభివృద్ది చెందిన ఉపరితలం కాకుండా బైటినుంచి తీసుకువచ్చి అంటుకట్టిన రాజకీయ ప్రత్యేకతల వల్ల భారతదేశం బూర్జువా ప్రజాస్వామిక విప్లవానికి, స్వతంత్ర పెట్టుబడిదారీ విధానానికి దూరమైంది.
– బూర్జువా ప్రజాస్వామిక విప్లవం జరగకుండా బూర్జువా ప్రజాస్వామిక ఉపరితలాంవాలను దిగుమతి చేసుకోవడం భారత ప్రత్యేకత ఆ ఉపరితలాంశాలను చూసి పెట్టుబడిదారీ విధానంగా భ్రమపడడం జరుగుతున్నది.
– వచ్చిన పెట్టుబడి అంతర్గత అభివృద్దితో వచ్చినది కాదు, బాహ్య జోక్యం వల్ల, ద్రవ్య పెట్టుబడి వల్ల, వలస వల్ల వచ్చినది. అది వలస, సామ్రాజ్యవాద పెట్టుబడికి లొంగి, దళారీగా మాత్రమే ఉంటుంది. అది స్వతంత్రంగా ఎదగదలచుకున్నా ద్రవ్య పెట్టుబడి దశలో అది సాధ్యంకాదు. వర్గపోరాట బలాబలాల పొందిక మారినప్పుడు మాత్రమే ఆ బూర్జువావర్గంలోని జాతీయ శక్తులు వికసిస్తాయి.
– ఇప్పుడున్నది పెట్టుబడిదారీ విదానమే అనుకుంటే, ఇది ఏ బూర్జువా ప్రజాస్వామిక విప్లవం వల్ల రూపొందింది? అది ఎప్పుడు జరిగింది? దానికి నాయకత్వం వహించినవారెవరు? అది ఏవర్గాల ప్రయోజనాల కొరకు జరిగింది? ఇది బూర్జువా ప్రజాస్వామిక విప్లవం అనుకుంటే కనీస కార్యక్రమమైన భూసంస్కరణలు ఎందుకు అమలు జరగలేదు? ఉత్పత్తిశక్తుల విడుదల ఉత్పాదకత పెరుగుదల ఎందుకు జరగలేదు?
– ఉత్పత్తి శక్తులలో (ఉత్పత్తి సాధనాలలో, ప్రజలలో), ఉత్పత్తి సంబంధాలలో, ఉపరితలంలో మార్పులు కనబడుతున్నాయి. కాని ఆ మార్పుల స్వరూప స్వబావాలను, సారాంశాన్ని విశ్లేషిస్తే అవి చారిత్రక దశలో ఉన్నతదశకు గుణాత్మకంగా పరివర్తన చెందినట్టుగా చెప్పలేము.
– సమాజం, వ్యవస్థ మారాయా లేదా అనే ప్రశ్నకు జవాబు ఎవరి దృష్టికోణం నుంచి చెప్పుకోవాలి? భారత సమాజంలో భూమిలేని నిరుపేదల, చిన్న రైతుల దృక్కోణం నుంచి మాత్రమే చెప్పుకోవాలి.
స్థూలంగా అక్కడ వెలువడిన వాదనలల ప్రధానమైనవి ఇవి. వీటిలో సంవిధానాలు మారవలసి ఉంటుందనే వాదనను కొంతవరకు అంగీకరించవచ్చు. వస్తువులో మార్పు సహజం, అనివార్యం గనుక ఆ వస్తువును పరిశీలించే పద్దతి కూడ నానాటికీ పదును దేరవలసి, నిశితం కావలసి ఉంటుంది. ఆ అర్థంలో ఈ వాదనలలో కొన్నిటిని ఆలోచించ వచ్చు. కొత్త పరికరాలను మన సంవిధానంలోకి చేర్చుకోవచ్చు. దాని అర్థం మార్క్సిస్టు చారిత్రక భౌతికవాద పద్దతిని పూర్తిగా వదులు కోవాలని కాదు. పద్దతిని సృజనాత్మకంగా మార్చుకోవాలి. కొత్త దృగ్గోచరాంశాలను అర్ధం చేసుకోగల వైశాల్యాన్ని లోతును పంతరించుకోవాలి. అందుకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కాని గతంలో ఈ ఆలోచనతో సాగిన ప్రయాత్నాలన్నీ చివరికి అసలు పద్దతినే వదులుకునే దగ్గరికి దారితీశాయి. గనుక కొత జాగరూకత అవసరం. ఎన్ని కొత్త ఆలోచనలకైనా అవకాశం ఇవ్వవచ్చు. కాని ప్రజాజీవితం, దోపిడీ పీడనలకు వీలులేని సమానత్వాన్ని సంతరించుకోవాలనే మౌలిక దృక్పధాన్ని వదులుకోకూడదు. ఆ దృక్పథం మార్క్సిజం తప& మరొకటి కాదు. గాలిపటం ఎగరేసినట్టుగా ఆలోచనలను ఎంత స్వేచ్చగానైనా, ఎక్కడికైనా వెళ్లనివ్వవచ్చు కొత్త గాలులలో విహరించనివ్వవచ్చు. కాని అది గాలివానటు కాకూడదు. గాలిపటానికి ఆధారమైన దారం ఉండాలి. ఆ దారం చైతన్యవంతమైన, ఆచరణశీలి అయన మనిషి చేతిలో ఉండాలి. ఆ మనిషి స్థిరంగా భూమి మీద నిలబడి ఉండాలి. గాలిపటంతో పాటు దారమూ మనిషీ కొట్టుకుపోయి అసలు భూమే లేదనే భావవాదానికి చేరితే కష్టం.
ఇక పెట్టుబడిదారీ విధానం వచ్చిందనీ, వస్తున్నదనీ, కొన్న చోట్ల వచ్చిందనీ, కనబడినదల్లా పెట్టుబడిదారీ విధానానికి నిరూపణేననీ, అర్థభూస్వామ్య అర్ధవలస వాదులు బాదస్తంగా, మూర్ఖుంగా తమ వాదనకు కట్టుబడి ఉన్నారనీ సాగిన వాదనలు సైద్దాంతికంగానూ చెల్లవు, వాస్తవాల రీత్యానూ చెల్లవు. పెట్టుబడిదారీ విధానం అంటే పెట్టుబడి రూపాలు మాత్రమే కాదు, అది అదనపు విలువ దోపిడీ మీద, విస్తృత పునరుత్పత్తి మీద, ఉత్పత్తిశక్తుల గరిష్ఠ వినియోగం మీద, నిరంతరం పెరిగిపోయే పెట్టుబడి సంచయనం మీద ఆధారపడిన సామాజిక సంబంధాల సమాహారం. మన చుట్టూ ఎన్నెన్ని సరుకులు కనబడినా, ఎంత మిరుమిట్లు గొలిపే పెట్టుబడి కనబడినా అవతి ఈ గుణాత్మకంగా భిన్నమైన ఉత్పత్తి సంబంధాల చిహ్నాలు కావు, సామ్రాజ్యవాద యుగంలో అలా ఒక దేశంలో పెట్టుబడిదారీ విధానం పుట్టుకురావడానికి, విస్తరించడానికి సైద్దాంతికంగా అవకాశమే లేదు. భారత సమాజ ప్రత్యేకతలు అందుకు అవకాశం ఇవ్వవు. ఒక చోట పెట్టుబడిదారీ విధానం వచ్చింది. మరొకచోట రాలేదు అనడం కూడా కుదరదు. అది ఒకచోట వస్తే, వచ్చే అవకాశమే ఉంటే అన్న చోట్లకూ విస్తరిస్తుంది. ఇది వేరేరకమైన పెట్టుబడిదారీ విధానం అనదలచుకుంటే, పెట్టుబడిదారీ విధానం అనే మాట వాడనక్కరలేదు.
నిజానికి నక్సల్బరీ పంథా సూత్రీకరించిన నాటికన్న ఎక్కువ వివరాలతో,ఎక్కువ అనుభవంతో, ఎక్కువ ఆచరణతో అర్థవలస అర్థభూస్వామ్య సూత్రీకరణనుసమర్థించగల అవకాశం ఇవాళ ఉంది. ప్రపంచీకరణ విధానాల తర్వాత దేశంలో జాతీయ బూర్జువావర్గం, దేశభక్తియుత బడా పెట్టుబడిదారీ వర్గం లేదని స్పష్టంగా బహిరంగంగా రుజువైపోయింది. నూతన ఆర్ధిక విధానాలను వ్యతిరేకిస్తామని 1990ల మొదట్లో రాహుల్ బజాజ్ నాయకత్వంలో ఆరు నెలలో, ఏడాదో గొణిగిన బాంబే క్లబ్ పెద్లఉ కూడ ఆ తర్వాత నోరు మూసుకుని సామ్రాజ్యవాద పెట్టుబడికి రాసోహం అంటూ జూనియర్ సార్ట్‌నర్లుగా, దళారీలుగా సర్ధుకున్నారు. అనాటినుంచి అణు ఒప్పందం దాకా ఈ రెండు దశాబ్ధాలలో ఈ దేశ పాలకుల అర్థవలస స్వభావంరోజురోజుకూ స్పష్టమయింది. ఈ క్రమంలో భారత దళారీ బడా బూర్జువాలు బహుళజాతి సంస్థలుగా ఎదిగారన్నా, విదేశాలలో పెట్టుబడులు పెట్టగలిగారన్నా, సామ్రాజ్యవాద పెట్టుబడి వలయంలో భాగంగా, వారి దళారులుగా మాత్రమే తప్ప, స్వతంత్ర, దేశీయ పెట్టుబడి దారులుగా కాదు. మరొకవైపు ఈ క్రమంలోనే భూకేంద్రీకరణ, చిన్న కమతాల వ్యవసాయం, వ్యవవసాయ సంక్షోభం, రైతాంగం మీద రుణభారం, లక్షలాదిగా రైతులయ ఆత్మహత్యలు, అభివృద్ది నిరోధక ఉపరితలాంశాల ప్రభావం వంటి అర్థభూస్వామ్య చిహ్నాలెనో& బలపడ్డాయి. అసలు అర్ధవలస అర్థభూస్వామ్య లక్షణాలను విడదీసి చూడడం కూడ సరైన పద్దతి కాదు.
– ఎస్ వేణుగోపాల్
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో…