రెండోరోజూ భారీగా చెక్కుల పంపిణీ

రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌ అన్న కడియం
వరంగల్‌,మే11(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘రైతుబంధు’ పథకం చెక్కుల పంపిణీ రెండోరోజూ శుక్రవారం కొనసాగింది. వరంగల్‌ జిల్లాలోని క్యాతంపల్లిలో  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి  ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సభాపతి మధుసూదనాచారి, నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్‌ జిల్లాలో కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో రైతులను ఎలా ఆదుకోవచ్చో చేసి చూపే బృహత్తర కార్యక్రమం తెలంగాణలో సిఎం కెసిఆర్‌ చేసి చూపారని అన్నారు. దేశంలో 70శాతం మంది రైతులే ఉన్నారని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని  అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ఎకరానికి రూ.4వేల చెక్కులను రైతులకు అందజేశారు. కేసీఆర్‌ది రైతుల ప్రభుత్వమని, దేశానికి అన్నంపెట్టే రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు రాష్ట్రంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం సంవత్సరానికి రెండు కిస్తుల్లో ఎకరానికి రూ.8వేలు అందించడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం అయ్యాయని, రైతుల బాధలను పట్టించుకోలేదన్నారు. గతంలో రైతులకు సరిపడా డీఏపీ, యూరియా బస్తాలు దొరికేవి కావని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళారుల చేతిలో
మోసపోకుండా రైతులకు కావాల్సినంత యూరియా, డీఏపీని అందిస్తోందన్నారు. రైతుల కళ్లలో ఆనందమే కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. రైతులకు ఇచ్చే డబ్బులను దుబార ఖర్చు చేయకుండా విత్తనాలు, మందులు కొనుగోలు చేయాలన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోడానికి ప్రభుత్వం రైతు సమన్వయ సమితి సంఘాలను ఏర్పాటు చేశారన్నారు.  రైతులు ఎప్పుడు వచ్చిన చెక్కులు తీసుకొని నగదు ఇవ్వాలని బ్యాంక్‌ అధికారులకు ఆదేశించామన్నారు. కేసీఆర్‌కు రైతుల ఆశీర్వాదం ఉండాలన్నారు.
—————-