రెండ్రోజుల ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) :
లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో షెడ్యూల్‌ కన్నా రెండ్రోజుల ముందే బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం సభ సమాజవేశం కాగానే లోక్‌సభ అట్టుడుకింది. కోల్‌గేట్‌, రైల్‌గేట్‌ తదితర అంశాలపై ప్రధాని తప్పుకోవాలని విపక్షాలు సభను అడ్డుకున్నాయి. బొగ్గు కుంభకోణం, రైల్‌గేట్‌   అంశాల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు అశ్వనీకుమార్‌, పవన్‌కుమార్‌ బన్సాల్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ విూరాకుమార్‌ సభను నిరవధికంగా వేశారు. వాస్తవానికి లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 10 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, విపక్షాల ఒత్తిళ్ల నేపథ్యంలో రెండ్రోజుల ముందే సభను నిరవధికంగా వాయిదా వేసి తప్పించుకొంది.గత రెండు వారాలుగా విపక్షాలు సభను స్తంభింపజేస్తున్నాయి. బొగ్గు కుంభకోణం, రైలుగేట్‌ ఉదంతాల్లో ప్రధాని రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. మన్మోహన్‌తో పాటు న్యాయ, రైలు శాఖ మంత్రులు అశ్వనీకుమార్‌, పవన్‌కుమార్‌ బన్సాల్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. దీంతో రెండు వారాలుగా సభలో పెద్దగా చర్చ సాగలేదు. కేవలం ఆర్థిక బిల్లులు మాత్రమే సభ ఆమోదం పొందాయి. ఆ బిల్లులు ఆమోదించకపోతే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందన్న కారణంగా బీజేపీ సహకరించి, వాకౌట్‌ చేయడంతో ప్రభుత్వం ఆయా బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోగలిగింది. అయితే, రాజీనామాల విషయంలో మాత్రం విపక్షాలు, ప్రభుత్వం పట్టింపులకు పోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. సభ వాయిదాల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలో విపక్షాలకు చెక్‌ చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెండ్రోజుల క్రితం కీలకమైన ఆహార భద్రత బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అయితే, ఆ బిల్లుపై మరింత చర్చించాల్సి ఉందని, దాన్ని ఆమోదించబోమని విపక్షాలు తేల్చిచెప్పాయి. ముందుగా ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయిస్తేనే సభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో చేసేదేవిూ లేక స్పీకర్‌ విూరాకుమార్‌ సభను నిరవధికంగా వాయిదా వేశారు.అయితే, సభలో నెలకొన్న ప్రతిష్టంభనపై అధికార, విపక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. ప్రతిపక్షం కావాలనే సభను అడ్డుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ విమర్శించింది. సభను అడ్డుకొని బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పాతర వేసిందని ఆ పార్టీ నేత కేవీ థామస్‌ ఆరోపించారు. బీజేపీ గూండాయిజాన్ని పెంచిపోషిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్‌ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. లోక్‌సభ స్తంభించడానికి అధికార పక్షమే కారణమని పేర్కొంది. అవినీతి మంత్రులతో రాజీనామా చేయిస్తే సభ సజావుగా సాగుతుందని తెలిపింది. ఆహార భద్రతా బిల్లు ఆమోదించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కానీ, అంతకంటే ముందు దానిపై విస్తృత చర్చ అవసరమని స్పష్టం చేసింది.