రైతాంగాన్ని దివాలా తీయిస్తున్న కేంద్ర ప్రభుత్వం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతాంగాన్ని దివాలా తీయిస్తున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి విమర్శించారు.జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పీఎం మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతాంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తుందన్నారు.అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు నెరవేర్చకపోగా, ప్రజలపై అనేక భారాలు మోపుతూ దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.నల్ల చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బందికి గురిచేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా,రుణమాఫీలు చేయకుండా ఉందన్నారు.అకాల వర్షం వల్ల రైతాంగాన్ని ఆదుకోవాలని,కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వర్లు, కందాల శంకర్ రెడ్డి, నారాయణ వీరారెడ్డి, ఎస్ కే సైదా, మందడి రాంరెడ్డి, దండా శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, గట్టుపల్లి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.