రైతుకు కూర’గాయాలు’!

రైతు కష్టార్జితం దళారుల పాలు ,
తోటలో వంకాయలు కిలో రూ.20 ,
మార్కెట్‌లో కిలో రూ.35పైనే ,
ఒంగోలు ,జూన్‌ 30 : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. అదెంతో వాస్తవం కూడా! ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల సగటు ధర కిలో రూ.40పైనే పలుకుతోంది. వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇంతగా ధరలు పెరిగినా కూరగాయలను పండించే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. కాయకష్టం చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించే రైతుల్లోనూ… కొనే వినియోగదారుల్లోనూ ఆనందం కనిపించక పోవడం విచిత్రం! మార్కెట్లను శాసిస్తున్న దళారీ వ్యవస్థే అందుకు కారణంగా ూంది. ఇటు రైతుల కష్టార్జితాన్నీ, అటు వినియోగదారులను దోచుకుని దళారులు లాభాలు గడిస్తున్నారు. ఒంగోలుకు సమీపంలో సముద్ర తీర ప్రాంతమైన కొత్తపట్నం మండలంలో కూరగాయల రైతుల స్థితిగతులపై ‘ప్రజాశక్తి’ పరిశీలన చేసింది. మార్కెట్‌లో ధరలు ఆకాశానికి చేరినా రైతులకు దక్కేది అందులో సగమైనా లేదు. కొత్తపట్నం శివార్లలో తనకున్న అరెకరంలో అన్నెమ్మ వంగ సాగు చేపట్టారు. రెండు నెలలుగా కరెంటు లేక తోటను వదిలేశారు. ఇటీవల రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశాక కరెంటు సరఫరా కొద్దిగా మెరుగుపడింది. ప్రస్తుతం తోటలకు మళ్లీ నీరు పెడుతున్నారు. అరెకరంలో ఇప్పటివరకూ 20మనుమలు (ఒక మనుమకు పది కిలోలు) పండాయి. మనుమ ధర రూ.180 నుంచి రూ.200 ఉంది. అంటే కిలో రూ.20 పడుతుంది. రైతుకు దక్కుదల అంతే! పెట్టిన పెట్టుబడులపై ఆశలు వారిలో కనిపించడం లేదు. కరెంటు లేక అరకొరగా వచ్చిన పంటను కొందరు పేద మహిళలు తోటల్లో కొనుగోలు చేసి ఒంగోలు తరలిస్తారు. కమీషను ఏజంట్లకు అమ్ముకుంటారు. వీరికి మనుమకు రూ.30నుంచి 40 వస్తాయి. రానుపోను రవాణా ఖర్చులు పోతే వారికి కూలి మాత్రమే దక్కుతోంది. కమీషను ఏజంట్లు డిమాండును బట్టి చిల్లర వర్తకులకు విక్రయిస్తారు. అక్కడ రేటును వ్యాపారులే నిర్ణయిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో వంకాయలు కిలో రూ.35 పలుకుతున్నాయి. మొన్నటి వరకూ రూ.40దాకా అమ్మాయి. ఇపుడు నెల్లూరు, బాపట్ల నుంచి వంకాయలు రావడంతో వీటికి ధర కొద్దిగా తగ్గింది. వినియోగదారులకు చేరేలోపు ధర రెట్టింపు కావడం మార్కెట్‌ శక్తుల మాయాజాలమే! రాత్రింబవళ్లు కష్టపడితే తమకు దక్కేదేమీ లేదని రైతు అన్నెమ్మ వాపోయారు. ఆమె నుంచి వంకాయలు కొనుగోలు చేసి ఒంగోలుకు తరలిస్తున్న ప్రభావతి మాట్లాడుతూ తమకూ ఖర్చులు పోతే వంద లేదా నూటయాభై రూపాయలే మిగులుతున్నాయని తెలిపారు. పొలంలో నుంచి కాయల బస్తాలు మోయలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ధర వ్యాపారుల చేతిలోనే ఉందని మరో రవాణాదారు రమణ చెప్పారు. గోంగూరు కట్ట మార్కెట్‌లో ఐదు రూపాయలు ధర పలుకుతోంది. ఏ ఆకుకూరకైనా ధర అంతే ూంటుంది. అరెకరంలో సాగు చేసిన గోంగూరను నాలుగు వేల రూపాయలకు వ్యాపారులు కొంటారు. కనీసం నాలుగు నుంచి ఐదువేల కట్టల వరకూ పంట వస్తుంది. దాన్నిబట్టి కట్టకు రూపాయి మాత్రమే రైతుకు దక్కుతోంది. వ్యాపారులు మార్కెట్‌లో కట్ట రూ.5 అమ్ముతారు. రెండు నెలల పాటు శ్రమించిన రైతుకన్నా రెండు రోజులు వ్యాపారం చేసేవారే ఎక్కువ ఆదాయం పొందడం గమనార్హం. రైతులు, వినియోగదారులకు లాభం చేకూరే మార్గాన్ని ప్రభుత్వమే చూపాల్సి ఉంది.