రైతుబంధు ఎంతో ఉపయోగకరం

భద్రాద్రి కొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని సీఎం కేసీఆర్‌ పెట్టి రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన మునుగోటి శైలజ, వీరవసంతరావులు అన్నారు. రైతు బంధు పథకమే కాకుండా తెలంగాణలోని ప్రతీ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి పథకాలు పెట్టి రాజకీయాలకు అతీతంగా వాటిని అమలు చేయండం అభినందనీయమని అన్నారు. తమకు బోనకల్లు మండలంలో రావినూతల రెవెన్యూ పరిధిలో రెండు ఎకరాల 12 కుంటల భూమి ఉందని, దానికి తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రూ.10,800 చెల్లించిందన్నారు. ఇలాంటి పథకం అమలు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని ఆంధ్రా ప్రాంతానికి చెందిన రైతులకూ అందిస్తూ సాగుకు పెట్టుబడి అందించే పెద్దన్న సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని రావినూతల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన మునుగోటి శైలజ, 
వీరవసంతరావులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రా రైతులు మాట్లాడుతూ.. తమ రాష్ట్రంతో పాటు అంతటా దీనిని విస్తరించాలన్నారు.