రైతుబంధు సిఎం కెసిఆర్‌

పథకం ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్‌ మధుసూధనాచారి
జయశంకర్‌ భూపాలపల్లి,మే10(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పని చేస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి చెప్పారు. అందుకోసమే రైతుబంధు పథకం తీసుకుని వచ్చి అన్నదాతలకు ఎకరాకు నాలుగువేల సాయం అందచేస్తున్నారని అన్నారు. రైతులను ఆదుకునేందుకు ఇలాంటి పథకం అంటూ ఒకటి దేశంలో ఎక్కడా లేదన్నారు.
భూపాలపల్లి మండలం కమలాపూర్‌ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామ రైతులకు ఆయన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. 239 మంది రైతులకు 15 లక్షల 20 వేల 630 రూపాయల విలువగల చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో కనీవినీ ఎరుగని రోజు అని స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. ఇది రైతులకు శుక్ర మహాదశ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయక దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. పక్కనే నీళ్లు పారుతున్నా వాటిని వాడుకోలేని దుస్థితి అన్నారు. గతంలో విత్తనాల కోసం రైతులు యుద్ధం చేయాల్సి వచ్చేదని, నీళ్లు ఇవ్వకున్నా ప్రభుత్వాలు శిస్తు వసూలు చేసేవని గుర్తుచేశారు. జిల్లాలో మొత్తం 134 కోట్ల రూపాయలు రైతులకు మొదటి విడత పెట్టుబడి సాయం ఇవ్వనున్నారని స్పీకర్‌ వెల్లడించారు. అప్పు చేసైనా పంటలు పండించే గొప్ప గుణం రైతుదని, అందుకే రైతును రాజుగా చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పం తీసుకున్నారని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అమేయ కుమార్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.