రైతులకు అండగా నిలవాలి
నల్గొండ,అక్టోబర్26(జనంసాక్షి): ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లాలో అవసరమైన మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. జిల్లాలో పత్తి
కొనుగోలు కేంద్రాలకు తరలించి పత్తిని అమ్మాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు అందేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయితే ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా తరుగు పేరుతో రైతులపై అదనపు ధాన్యం భారం వేస్తున్నారు. మార్కెట్‌యార్డుకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నారు. తరుగు వస్తున్నందున ఆ భారం కూడా రైతులదేనని అధికారులు స్పష్టం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు ప్రారంభానికి ముందే అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా..అవి కానరావడంలేదు. ధాన్యం నమూనాలు పరిశీలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా కొనుగోలు ఆలస్యమవుతున్నాయి. ఇదిలావుంటే
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులను అడుగుడునా అవస్థలపాలుచేస్తున్న ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ధాన్యంతెచ్చిన రైతులు 15 రోజులుగా నిరీక్షిస్తున్నారోజుకో కొర్రీపెడుతూ కొనుగోలు చేయకుండా
ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 40కిలోలకు అదనంగా ఒక కిలో ధాన్యం ఇస్తేనే కొనుగోలు చేస్తామని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అతివృష్టి, అనావృష్టివల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌చేశారు.