రైతుల్ని ముంచే ఆర్డినెన్స్‌

C
అన్నా దీక్షకు కేజ్రీవాల్‌ మద్దతు

దిల్లీ సచివాలయానికి విచ్చేయండి

హజారేకు దిల్లీ సీఎం ఆహ్వానం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): భూసేకరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన ఆందోళన మంగళవారినికి రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు ఆందోళన కార్యక్రమంలో అన్నా హజారేతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ పాల్గొన్నారు. జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన ఈ ఆందోళనకు మధ్యాహ్నం 3 గంటలకు కేజీవ్రాల్‌ హాజరయ్యారు. అన్నాహజారే చేపట్టిన ధర్నాకు కేజీవ్రాల్‌ మద్దతు తెలిపారు. అన్నా ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. సోమవారం  సాయంత్రం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో అన్నాతో సమావేశమైన కేజీవ్రాల్‌ భూసేకరణ అంశంతో పాటు దేశంలో అవినీతిపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేజీవ్రాల్‌ మాట్లాడుతూ.. అన్నా నిరసనకు ఆప్‌ మద్దతునిస్తుందని తేల్చిచెప్పారు. ఎవరి నుంచైనా బలవంతంగా భూసేకరణ చేయలేరన్నారు. పేదలు, రైతులకు వ్యతిరేకంగా పని చేస్తే ఏ ప్రభుత్వమైనా నిలవదు అని చెప్పారు. వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీలకు లేదా ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రజల ఆనందంగా వారివారి భూములిస్తేనే తీసుకోవాలని తెలిపారు. భూసేకరణ బిల్లును ఢిల్లీ ప్రభుత్వం అంగీకరించదన్నారు. పేదలకు లేదా ప్రజలకు వ్యతిరేకంగా తీసపుకునే నిర్ణయాలను సమర్థించమన్నారు. ఇదిలావుంటే ఢిల్లీ సచివాలయానికి సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేను సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆహ్వానించారు. కేజీవ్రాల్‌ ఆహ్వానానికి అన్నా సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో బుధవారం  ఢిల్లీ సచివాలయానికి హజారే వెళ్లనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో కొంత సమయం మాట్లాడాలని అన్నాను కేజీవ్రాల్‌ కోరారు. అన్నా హజారే ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడనున్నారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద హజారే చేపట్టిన రెండు రోజుల ధర్నా నేటితో ముగిసింది. కాగా దిల్లీ సచివాలయానికి రావాల్సిందిగా అన్నాను ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆహ్వానించారు. అన్నా కూడా కేజ్రావాల్‌ అహ్వానానికి సరేనన్నారు.