రైతుల సంక్షేమం కోసం ఎంతభారమైనా భరిస్తాం

విద్యుత్‌ కొరత ఇంతుంటుందనుకోలేదు
గ్యాస్‌ కొరతే విద్యుత్‌ సమస్యకు మూలం :  సీఎం కిరణ్‌కుమార్‌
హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి):
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత భారమైనా భరిస్తుందని వారి అవసరాలు తీర్చడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పంటలు కాపాడేందుకు ప్రభుత్వం అన్నీ విధాల తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి జరగనప్పటికీ రైతుల అవసరాలు తీర్చేందుకు, రాష్ట్ర ప్రయోజనాలు నేరవేర్చేందుకు ఎక్కువ రేటు అయినా విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రెండురోజులుగా విద్యుత్‌ సమస్యపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ, ఆరోపణలు, విమర్శలపై ముఖ్యమంత్రి కిరణ్‌ మంగళవారం సాయంత్రం సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఇంత పెద్ద ఎత్తున విద్యుత్‌ కొరత ఉంటుందని ఊహించలేదని చెప్పారు. గ్యాస్‌ కొరత, వర్షాభావం వల్లే విద్యుదుత్పత్తి తగ్గిందన్నారు. రాష్ట్రంలో గ్యాస్‌ ద్వారానే అధిక శాతం విద్యుదుత్పత్తి అవుతుందన్నారు. జలవిద్యుత్‌ ఉత్పత్తి కూడా లోటుగా ఉందన్నారు. నాఫ్తాతో 12మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. రైతుల ప్రయోజనం కోసం యూనిట్‌ రూ.12కు కొనుగొలు చేసి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఎక్కడెక్కడ వీలుందో అక్కడినుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 259 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ సరఫరా చేశామని చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తికి అదనంగా గ్యాస్‌ కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు దక్షిణాదిన విద్యుత్‌ పరిస్థితి బాగుండేదన్నారు. గ్రిడ్‌ అనుసంధానం లేకపోవడం వల్లే ఉత్తరాదినుంచి విద్యుత్‌ను తెచ్చుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందనుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి గ్రిడ్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కేంద్రం నుంచి 126మెగావాట్ల విద్యుత్‌ను తెచ్చుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో గ్యాస్‌ ఉత్పత్తి ఎక్కువగా జరిగితే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఈ ఏడాది 4,375 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగే అవకాశం ఉందన్నారు. ఆగిపోయిన విద్యుత్‌ కేంద్రాలకు రాయితీలు ఇచ్చి నడిపిస్తున్నామని చెప్పారు. విద్యుత్‌ పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపామని చెప్పారు. కేంద్ర నుంచి సానుకూల సమాధానం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది నీటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిందన్నారు. 2500 మెగాయూనిట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. 2006-08వరకు ఇంధన సర్దుబాటు జరగలేదన్నారు. 2011-12లో రూ.4,300కోట్లు, 2012-13లో రూ.6,500కోట్లు సబ్సిడీ ఇచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. వ్యవసాయ సంబంధిత రాయితీల్లో 58శాతం తెలంగాణ ప్రాంతానికే అందిస్తున్నామని చెప్పారు. మొత్తం రూ.22,220కోట్ల రాయితీల్లో రూ.12,975కోట్లు తెలంగాణ ప్రాంత రైతులకే అందించామన్నారు. తెలంగాణ ప్రాంతంలో నీటి వసతి లేదు కాబట్టే ఎక్కువగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయ పంపుసెట్లలో 12లక్షలకు పైగా తెలంగాణలోనే ఉన్నాయన్నారు. రాయలసీమలో 7లక్షలు, కోస్తా ఆంధ్రలో 6లక్షల 40వేల పంపుచెట్లు ఉన్నాయని చెప్పారు. దిగుమతి చేస్తున్న బొగ్గును అతి తక్కువ ధరకు కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రధమమని చెప్పారు. బొగ్గు కొరత తీవ్రంగా ఉందన్నారు. కేంద్రం కేటాయించిన మేరకే బొగ్గును వాడుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎ విధానం ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది కాదన్నారు. వైయస్సార్‌ హయాం నుంచే ఉందని చెప్పారు. 2003-04లోనే ఈ విధానం ఉందన్నారు. ఎఫ్‌ఎస్‌ఎ వల్ల ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చూస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. రత్నగిరికి గ్యాస్‌ కేటాయిస్తే అడ్డుకోవడంలో విజయం సాధించామన్నారు. కడపటి వార్తలు అందేసరికి ముఖ్యమంత్రి సమాధానంపై టిఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు సభలో మాట్లాడుతున్నారు.