రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి 

నల్గొండ, మార్చి5(జ‌నంసాక్షి) : పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల కోసం విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ ఎస్సై వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో  గాయపడిన ఎస్సై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాధ సంఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై మధు(40) నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్‌ దేహదారఢ్య పరీక్షలకు విధుల్లో పాల్గొనేందుకు తన వాహనంలో వెళ్తున్నారు. సవిూపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ముందు ఆయన వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఎస్సైని నార్కట్‌ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఎస్‌ఐకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మధు మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాధంలో మునిగిపోయారు. మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యాంతమయ్యారు. ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోచంపల్లి ఎస్సై మధుసూదర్‌ మృతదేహానికి ఉన్నతాధికారులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో నివాళులర్పించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, జిల్లా ఎస్పీ రంగనాథ్‌, సీఐలు, డీఎస్పీలు, ఇతరు అధికారులు పాల్గొన్నారు. ఎస్సై కుటుంబ సభ్యులను అధికారులు పరామర్శించారు.

తాజావార్తలు