రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం

బాన్సువాడలో ఆర్టీఎ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి పోచారం
కామారెడ్డి,మే28( జ‌నం సాక్షి ): రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతంలో రోడ్ల నిర్మాణానికి రాష్ట్రం మొత్తానికి రూ. 300 కోట్లు కేటాయిస్తే నేడు ఒక్కో నియోజకవర్గానికి రూ. 300 కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం 2,500 కిలోవిూటర్ల మేర జాతీయ రహదారులుంటే.. గత నాలుగేళ్లలోనే అదనంగా 4 వేల కి.విూ. జాతీయ రహదారులుగా మార్చడం జరిగిందన్నారు.  బాన్సువాడలో రవాణా శాఖ కార్యాలయం(ఆర్టీఏ)ను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. ఈ నూతన కార్యాలయంతో బాన్సువాడ నియోజకవర్గంతో పాటు జుక్కల్‌ నియోజకవర్గంలోని ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజలకు శ్రమతో పాటు దూరభారం తగ్గుతుంది. స్థానికంగానే రవాణా శాఖ సేవలు అందుతాయన్నారు. స్కూల్‌ బస్సులు సురక్షితంగా చేరుకోవాలన్నా, వైద్యం తక్షణమే అందాలన్నా, రైతులు తాము పండించిన ధాన్యం మార్కెట్‌కు తరలించాలన్నా మంచి రోడ్లు అవసరమని మంత్రి చెప్పారు. ఈ అవసరాన్ని గుర్తించి సీఎం కేసీఆర్‌ రహదారుల నిర్మాణానికి అధిక నిధులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీఏ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, జిల్లా కలెక్టర్‌ యన్‌ సత్యనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.