రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి

ఖమ్మం,మే30(జ‌నం సాక్షి): రెండు జిల్లాల్లో  రోడ్ల నిర్మాణాలకు గాను ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా మంజూరైన కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల పనులను వేగవంతం చేసేలా కృషి చేయాలన్నారు. అత్యంత వెనుబడిన ప్రాంతం పాలేరులో రూ.400 కోట్లతో రహదారుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన పనులు చేసుకోవాలి కావాల్సిన పనులు అడగాలని కోరారు. వర్షాకాలం రాబోతున్నదున్న పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. రైతుబంధు పథకంపై వచ్చిన పంటసాయం చెక్కులు, పాసుపుస్తకాలను అందజేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని తమ సమస్యను పరిష్కరించాలని కొందరు రైతులు మంత్రి తుమ్మలకు వినతులు అందజేశారు.ఇలాంటి సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు. ఇకపోతే పంచాయతీలకు అతీతమైన అధికారాలు నిబంధలు రాబోతున్నాయని మంత్రి తెలిపారు. కొత్తగా నిబంధలు వచ్చే ఎన్నికల అనంతరం అమలు అవుతాయని తెలిపారు. ప్రభుత్వం ప్రధాన లక్ష్యం గ్రామాల అభివృద్ధి. అది జరిగేలా అన్నీ చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా పంచాయతీలకు కొత్తగా వచ్చే అధికారాలతో మంచి జరుగుతుందన్నారు.