ర్యాంకింగ్స్‌లో అజరెంకా , ఫెదరర్ టాప్
మూడో స్థానంలో ఆండీ ముర్రే
న్యూయార్క్, సెప్టెంబర్ 11: యుఎస్ ఓపెన్ ముగిసిపోవడంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య సరికొత్త ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. మహిళల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన విక్టోరియా అజరెంకానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఫైనల్ వరకూ చేరుకోవడంతో ఆమె ర్యాంకింగ్‌పై పెద్ద ప్రభావం పడలేదు. సెవిూఫైనల్ చేరుకున్న రష్యన్ బ్యూటీ మరియా షరపోవా ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంకులో నిలిచింది. పోలండ్ క్రీడాకారిణి రడ్‌వాన్‌స్కా మూడో స్థానానికి పడిపోగా… యుఎస్ ఓపెన్ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ ర్యాంక్ మాత్రం మారలేదు. సెరెనా ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఇటలీ ప్లేయర్ సారా ఇరానీ ర్యాంకింగ్ మెరుపరుచుకుంది. పదో ర్యాంక్ నుండి ఏడో స్థానానికి ఎగబాకింది. సమంత స్టోసర్ ఏడో స్థానం నుండి తొమ్మిదికి పడిపోగా… మరియన్ బర్తోలీ టాప్ టెన్‌కి చేరుకుంది. ఇదిలా ఉంటే మాజీ వరల్డ్ నెంబర్ వన్ కరోలినా వోజ్నియాకీ టాప్ టెన్‌లో చోటు కోల్పోయింది. గత మూడేళ్ళలో ఆమె ఇలా కిందకి పడిపోవడం ఇదే తొలిసారి. 2009లో అగ్రస్థానం సాధించిన వోజ్నియాకీ ఈ ఏడాది దానిని కోల్పోయినా… టాప్ టెన్‌లో కొనసాగుతూ వచ్చింది. అయితే యుఎస్ ఓపెన్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆమె ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న క్రీడాకారిణులు ఇస్తాన్‌బుల్‌లో జరగనున్న డబ్ల్యూటిఎ టోర్నీలో ఆడతారు. ప్రస్తుతం 11వ ర్యాంకులో నిలిచిన వోజ్నియాకీ టోక్యో , సియోల్ , బీజింగ్‌లలో జరగనున్న టోర్నీలలో రాణిస్తే టాప్ 8కి చేరే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెవిూస్‌లో నిష్కమ్రించిన ఫెదరర్ తన టాప్ ప్లేస్ నిలుపుకున్నాడు.జొకోవిచ్ రెండో స్థానంలో ఉండగా… కెరీర్‌లో తొలి గ్రాండ్‌శ్లామ్ సాధించిన ఆండీ ముర్రే ఒక స్థానం మెరుగై మూడో ర్యాంక్ దక్కించుకున్నాడు. గాయంతో ఈ సీజన్‌కే దూరమైన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఒక స్థానం దిగజారి నాలుగో స్థానంలో నిలిచాడు. యుఎస్ ఓపెన్‌లో ఫెదరర్‌కు షాకిచ్చిన థామస్ బెర్డిచ్ ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇవి తప్పిస్తే… పురుషుల విభాగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు.
మహిళల ర్యాంకింగ్స్ – టాప్ 10 ః
1. విక్టోరియా అజరెంకా – బెలారస్ – 10265 పాయింట్లు
2. మరియా షరపోవా – రష్యా – 8435 పాయింట్లు
3. రడ్‌వాన్‌స్కా – పోలండ్ – 8295 పాయింట్లు
4. సెరెనా విలియమ్స్ – అమెరికా – 7900 పాయింట్లు
5. పెట్రా క్విటోవా – చెక్‌రిపబ్లిక్ – 6690 పాయింట్లు
6. అంగెలీ కెర్బర్ – జర్మనీ – 5085 పాయింట్లు
7. సారా ఇరానీ – ఇటలీ – 4755 పాయింట్లు
8. లినా – చైనా – 4526 పాయింట్లు
9. సమంత స్టోసర్ – ఆస్టేల్రియా- 4200 పాయింట్లు
10. మరియన్ బర్తోలీ – ఫ్రాన్స్ – 3800 పాయింట్లు
పురుషుల ర్యాంకింగ్స్ – టాప్ 10 ః
1. రోజర్ ఫెదరర్ – స్విట్జర్లాండ్ – 11805 పాయింట్లు
2. నోవక్ జొకోవిచ్ – సెర్బియా – 10470 పాయింట్లు
3. ఆండీ ముర్రే – బ్రిటన్ – 8570 పాయింట్లు
4. రఫెల్ నాదల్ – స్పెయిన్ – 7515 పాయింట్లు
5. డేవిడ్ ఫెర్రర్ – స్పెయిన్ – 5915 పాయింట్లు
6. థామస్ బెర్డిచ్ – చెక్ రిపబ్లిక్ – 4830 పాయింట్లు
7. విల్‌ఫ్రెడ్ సోంగా – ఫ్రాన్స్ – 4520 పాయింట్లు
8. మార్టిన్ డెల్‌పొట్రో – అర్జెంటీనా – 3890 పాయింట్లు
9. టిప్సారెవిచ్ – సెర్బియా – 3285 పాయింట్లు
10. జాన్ ఇస్నర్ – అమెరికా – 2610 పాయింట్లు