లంక గ్రామాలకు వరద ముప్పు
– రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
అమలాపురం, జులై11(జనం సాక్షి) : గోదావరి వరద నీరు ధవళేశ్వరం బ్యారేజి నుంచి దిగువకు విడిచిపెడుతుండటంతో కోనసీమలోని వివిధ నదీపాయల్లోకి వరదనీరు చేరి జలకళ ఏర్పడింది. నాలుగు లంక గ్రామాలకు చెందిన తాత్కాలిక గట్టు వరదనీరు కారణంగా కొట్టుకుపోయింది. దీంతో ఆయా లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరిలో వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలోకి బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 2.80లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. దీంతో కోనసీమలోని వివిధ నదీపాయలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక, బూరుగులంక గ్రామాలు వశిష్ఠ గోదావరి నదికి మధ్యలో ఉంటాయి. వీరు నదీపాయలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గట్టు వరద నీరు కారణంగా కొట్టుకుపోయింది. దీంతో వీరంతా నాటుపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ గోదావరి నదీపాయ విూద వంతెన నిర్మించాలని ఏళ్ల తరబడి ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అతి తక్కువ వరద నీటికే వీరికి వరద కష్టాలు మొదలయ్యాయి. నవంబరు వరకు ఈ కష్టాలు వెంటాడతాయి.