లండన్‌లో ఇంకెన్నాళ్లని నినదించినతెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు

రఫీకి అభినందనలు
రఫీకి అభినంనలు
లండన్‌,(జనంసాక్షి) :తెలంగాణకు తరతరాలుగా జరుగుతున్న మోసాన్ని లండన్‌లో టీ ఎన్‌ఆర్‌ఐలు గొంతెత్తి ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు భరించాలి ఈ మోసాన్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు జరుగుతున్న మోసాలను చూస్తూ ఊరుకోబమని నినదించారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ ఉద్యమకారుడు రఫీ నిర్మించి, నటించిన ఇంకెన్నాళ్లు సినిమా డీవీడీని బుధవారం లండన్‌లో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ, సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురైనా, ఆర్థికంగా నష్టపోయినా, సినిమా కేబుల్‌ టీవీ, సోషల్‌ మీడియా ద్వారా లక్ష్యం చేరుకున్నానని తెలిపారు. సినీ పరిశ్రమలో తెలంగాణవారు స్థిరపడే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇంతకాలం సినీ పరిశ్రమ మొత్తం ఆంధ్ర పెత్తందారుల గుత్తాధిపత్యంలో ఉండిపోయిందని, ఇప్పటికీ వారి ఆధిపత్యమే కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐ ఫోరం నేత గంప వేణుగోపాల్‌ మాట్లాడుతూ తెలంగాణ వాళ్లను సినిమా పరిశ్రమతో పాటు అన్ని పరిశ్రమల్లో ఉన్నత స్థాయికి తీసుకువచ్చే బాధ్యతను తెలంగాణ ప్రజలే తీసుకోవాలన్నారు. సినిమా నిర్మాణానికి రఫీ ఎంతగానో కష్టపడ్డారని, ఆయన శ్రమకు వెలకట్టలేమని అన్నారు. సినిమాకి నంది అవార్డు రావడం అభినందనీయమన్నారు. అనిల్‌ కూర్మాచలం మాట్లాడుతూ, సినిమా తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడ్డదని తెలిపారు. సినీ పరిశ్రమలో మనవాళ్లు నిలదొక్కుకోవడం సీమాంధ్ర పెత్తందారులకు ఇష్టం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ అసమానతలు దూరమవుతాయని అన్నారు. కార్యక్రమంలో రంగుల సుధాకర్‌, వెంకట్‌ రంగు, ప్రమోద్‌, అశోక్‌గౌడ్‌, మహేశ్‌ పాల్గొన్నారు.