లై ‘సెన్సు’ లపై దృష్టి సారించని ఆర్‌టిఓ అధికారులు
కాకినాడ, జూలై 21, : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ లో సుమారు 7లక్షలకు పైగా ప్రజలు నివసిస్తుండగా, అనధికార అంచనాల మేరకు సుమారు లక్షకు పైగా మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్లు, లారీ, ఇతర పెద్ద వాహనాలు ఉన్నాయి.18 సంవత్సరాలు నిండిన వారికే లైసెన్సు ఇచ్చే ఆర్‌టిఓ అధికారులు నగరంలో పొద్దునుంచి రాత్రి వరకు 18 సంవత్సరాల లోపు యువతీ యువకులు వాహనాలను సెన్సు, లైసెన్సు లేకుండా నడిపి అనేక ప్రమాదాలకు ప్రధాన కారకులుగా మారుతున్నా పట్టించున్న దాఖలాలుండవు. వాహనాలపై కనీస అవగాహన కలిగి ఎటువంటి లైసెన్సు లేకుండా 18 సంవత్సరాల లోపు విద్యార్ధినీ విద్యార్ధులు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నారు. ఆర్‌టిఓ అధికారులు మాత్రం లైసెన్సులు లేని వాహన చోదకులపై ఇప్పటి వరకు చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రతిరోజూ కాకినాడ నగరంలో ఏదో ఒక మూల లైసెన్సులు లేని వాహనచోదకులు రోడ్డు ప్రమాదాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే అటు ట్రాఫిక్ పోలీస్, ఇటు ఆర్‌టిఓ అధికారులు లైసెన్సులు లేని వాహనచోదకుల వద్ద నుండి లంచాలు స్వీకరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప వారి కనీస బాధ్యతను గుర్తు చేయలేకపోతున్నారు. నగరంలో ప్రతి చోట ప్రతి రోజు ట్రాఫిక్ పోలీసులు త్రిబుల్ రైడింగ్, పద్దెనిమిది లోపు యువతీ యువకులు నడుపుతున్న వాహనాలను రోడ్డు పక్కనే పెట్టించి వారి లైసెన్సులను తనిఖీ చేసే సమయంలోనే పెద్ద ఎత్తున రికమండేషన్ పోర్సు రావడంతో వారిని వదిలేస్తున్నారే తప్ప ప్రతి కళాశాలకు వెళ్లి లైసెన్సులు తీసుకువెళ్లడం జరిగే వాటి గురించి కౌన్సిలింగ్ నిర్వహించలేకపోతున్నారు. నగరంలో ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకు త్రీటౌన్ వెనక ఉన్న ట్రాఫిక్ పార్కులో వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన కనీస సూత్రాల గురించి తర్ఫీదులిచ్చేవారు. అయితే ప్రస్తుతం అవన్నీ కాలగమనంలో కలిసిపోయాయి. కాకినాడ నగరంలో ప్రధాన రహదారులన్నీ ఆక్రమణలతో కుచించుకుపోయిన దశలో ప్రస్తుతం చేపట్టిన రోడ్డు విస్తరణ ఫలితాల వల్ల సరైన ఫలితాలిస్తాయనే అందరూ ఆశించిన దశలో ఇంకా రోడ్ల విస్తరణ సంపూర్ణంగా పూర్తి కానందున రోడ్ల విస్తరణతో ఏ విధంగా ప్రజలు ఆనందపడతారనే విషయంపై ఇంకా ఫలితాలు అందడం లేదు. ఇటువంటి దశలో నగరంలో కూడా రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోవడం, 214 కత్తిపూడి నుండి పామర్రు వరకు ఉన్న జాతీయ రహదారి కాకినాడ మెయిన్ రోడ్డు గుండానే వెళ్లడం వంటి కారణాలు కూడా ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారడానికి ప్రధాన కారణంగా తయారయ్యింది. ఇటువంటి దశలో వాహనాలు నడిపే వారికి కనీస అవగాహన లేకపోయినా పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి ఎటువంటి లైసెన్సులు లేకపోయినా పెద్ద పెద్ద వాహనాలను నడపడం వల్ల వారు పెద్ద ప్రమాదాలకు ప్రధాన కారకులుగా మారుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు అంతా ఈ వ్యవహారంపై తగు చర్యలు తీసుకొని ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.