లొంగిపోయిన మున్నాభాయ్‌

జైలు వరకు వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు
ముంబై, మే 16 (జనంసాక్షి) :
ముంబయి పేలుళ్ల కేసులో మున్నాభాయ్‌, సంజయ్‌దత్‌ గురువారం ముంబైలోని టాడా కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు టాడా కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. సంజయ్‌తో పాటు ఆయన సోదరి ప్రియాదత్‌, మహేశ్‌భట్‌ కూడా కోర్టుకు వచ్చారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో దత్‌కు సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 18 నెలల జైలు శిక్ష అనుభవించిన మున్నాభాయ్‌.. మరో మూడున్నరేళ్లు జైలు జీవితం గడపనున్నాడు. తీర్పును పునఃసమీక్షించాలంటూ దత్‌ చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన లొంగిపోక తప్పలేదు. ప్రాణ హాని ఉందన్న నేపథ్యంలో పోలీసులు దత్‌ ఇంటి నుంచి టాడా కోర్టు వరకూ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వందలాది అభిమానులు ఆయన వెంట రాగా, ప్రత్యేక బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో సంజయ్‌ కోర్టుకు హాజరయ్యాడు. తెల్లకుర్తా, జీన్స్‌ ప్యాంట్‌ ధరించి, ఎర్రటి తిలకం పెట్టుకొని కోర్టుకు హాజరైన 53 ఏళ్ల మున్నాభాయ్‌ ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనబడింది. ఇంటి నుంచి బయల్దేరే సమయంలో భార్య మాన్యత దత్‌ చేతిలో చేయి వేసి వీడ్కోలు పలికింది. అంతకు ముందు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా ప్రతినిధులు తరలివచ్చారు. దీంతో బాంద్రా పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. దత్‌ కోర్టులో లొంగిపోనున్న నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. అభిషేక్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, దావిడ్‌ ధావన్‌, సంజయ్‌ గుప్తా, అపూర్వ లఖియా, రాజ్‌కుమార్‌ హిరానీ, మిలాన్‌ లుథ్రియా తదితరులు ఆయన ఇంటికి వచ్చారు. రాజ్‌కుంద్రా, వసు భగ్నానీ, భూషణ్‌కుమార్‌, రాహుల్‌ అగర్వాల్‌ తదితరులు సంజయ్‌దత్‌ను ఓదార్చారు.