లోకోటికి కన్నీటి వీడ్కోలు

` ఇస్రోజివాడిలో ముగిసిన అంత్యక్రియలు
కన్నీటి పర్యంతమైన గ్రామం
కామారెడ్డి(జనంసాక్షి):మూడున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని పలు హోదాల్లో పనిచేసి పీడిత ప్రజల పక్షాన నిలిచిన విప్లవ వీరుడు లోకోటి చందర్ అలియాస్ పడకల్ స్వామి, అలియాస్ రవి, అలియాస్ ప్రభాకర్ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. రెండురోజుల క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భమ్రఘడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌటర్లో మతి చెందిన విషయం తెలిసిందే. చందర్ మతదేహాన్ని స్వగ్రామం అయిన కామారెడ్డి మండలం ఇస్రోజివాడికి ఆయన కుమారుడు లోకోటి రమేష్ ఆదివారం స్వగ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దశాబ్దాల కాలం పాటు బానిసత్వానికి గురై పీడించబడుతున్న ప్రజల పక్షాన నిలబడిన విప్లవ వీరుడు నేలకొరగడంతో ఇస్రోజివాడి గ్రామం కన్నీటి పర్యంతమైంది.వీరునికి చివరిసారిగా నివాళులర్పించేందుకు వివిధ జిల్లాల నుంచి పౌరహక్కుల సంఘం నేతలు పెద్దఎత్తున ఇస్రోజీవాడి గ్రామానికి చేరుకుని లోకోటి చందర్ మతదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేస్తారని ఓటేసి గద్దెవిÖద కూర్చోబెడితే ఎన్ కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులను మొత్తంగా ఏరివేయడానికి మార్చి 31 డెడ్ లైన్ పేరుతో బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గడ్చిరోలిలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని పేర్కొన్నారు. ఎన్ కౌంటర్లలో చనిపోయేది ఆదివాసీలు, గిరిజన బిడ్డలేనన్నారు. ఇవి ఎన్ కౌంటర్లు కావని, ప్రభుత్వ హత్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ బూటకపు ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.