ల్యాంకోహిల్స్ లగడపాటి భూదాహంపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం..
మణికొండలో ఆంధ్రా భూరాబంధుల తిష్ట
వేలకోట్ల విలువ గల భూములు హాంఫట్
చెరువులు, గుట్టలు, శ్మశానాలు, దర్గాలు కబ్జా
కబ్జా భూముల్లో ఆకాశహార్మ్యాల నిర్మాణం
కులదైవాలను కూల్చేసి మరీ భవంతుల ఏర్పాటు
వక్ఫ్‌బోర్డు భూములూ అన్యాక్రాంతం
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
హైదరాబాద్, నవంబర్ 26 (జనంసాక్షి) : ”కాదేది కవితకు అనర్హమని విప్లవ కవి శ్రీశ్రీ అంటే… కాదేది కబ్జాకు అనర్హమని” ల్యాంకోహిల్స్ లగడపాటి రాజగోపాల్ కబ్జాలకు కొత్తభాష్యం చెప్పారు. తెలంగాణలో ఎక్కడ ఖాళీ భూములు కనిపిస్తే.. సీమాంధ్ర గద్దలు అక్కడ వాలిపోతాయి. ఆ భూములు.. చెరువులా.. గుట్టలా.. శ్మశానాలా.. దర్గాలా.. అనేది వారికి అనవసరం.. కబ్జా చేశామా..? లేదా..? అన్నదే ముఖ్యం. భూములను కబ్జాచేయడమే పనిగా పెట్టకున్న ఆంధ్రా భూరాబంధుల కన్ను హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మణికొండ గ్రామం భూములపై పడింది. వెంటనే ఆ భూములను మింగేసేందుకు 2005లో పక్కా ప్లాన్ చేశాడు భూరాబంధు లగడపాటి. ప్లాన్ ప్రకారం.. భూములను కబ్జాచేశాడు. ఆ భూముల్లో ఆకాశహార్మ్యాలు నిర్మించాడు. కళ్లుచెదిరేలా పెద్దపెద్ద భవంతులు నిర్మించాడు. దానికి ల్యాంకోహిల్స్ అని పేరుపెట్టి కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. దీనిపై ‘జనంసాక్షి’ దినపత్రిక ప్రత్యేక కథనం అందిస్తోంది.
భూముల కబ్జాకు 2005లో పథకం…
హైదరాబాద్ చుట్టూత ఉన్న ఖాళీ భూములను అప్పనంగా ఆక్రమించేందుకు కాంగ్రెస్ మాజీ ఎంపి, ఆంధ్రా భూరాబంధు లగడపాటి రాజగోపాల్ 2005లోనే పథకం రచించాడు. అందుకు భూములు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తెలుసుకునేందుకు వేట మొదలుపెట్టాడు. ఆ వేటలో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మణికొండ గ్రామంలోని హుస్సేన్ షా వలి భూములు, చెరువులు, గుట్టలు, శ్మశానాలు, దర్గాలు, వక్ఫ్ భూములు రాజగోపాల్ రాబంధు కంటపడ్డాయి. అంతే.. వెంటనే అక్కడ వాలిపోయి ఆ భూముల కబ్జాను ప్రారంభించాడు. అందుకు అప్పుడు తనకున్న అధికారాలన్నింటినీ ఉపయోగించాడు. అప్పుడు మొదలైన వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది.
కోట్ల విలువ గల భూములు సస్తా ధరకు…
మణికొండకు ఆనుకుని 3 చెరువులు, 2 శ్మశానాలు, ఒక విశాలమైన గుట్ట, ఒక ప్రభుత్వ రహదారి ఉండేది. మణికొండకు ఉన్న చెరువుల్లో ఎల్లమ్మ చెరువు పెద్దది. సర్వేనెంబర్ 215లోని 23 ఎకరాల భూమి, 201 సర్వేనెంబర్‌లోని 108 ఎకరాల భూమి, సర్వేనెంబర్ 193లోని 3 ఎకరాల మైసమ్మకుంట భూమిని మొత్తం కబ్జాచేశాడు. ఈ భూముల ధరలు ఎకరాకు రూ.50 కోట్లుంటే అత్యంత సస్తాకు రూ.4 కోట్లకే తన్నుకుపోయాడు. అంతేకాదు.. వందల కోట్ల విలువచేసే వక్ఫ్‌భూములు ఉన్నాయి. వీటిని కూడా అగ్గువకు మింగేశాడు. 108 ఎకరాల భూముల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో పెద్దపెద్ద అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని చేపట్టాడు. చెరువు భూములను ఆక్రమించి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో.. సకల సౌకర్యాలతో.. స్వర్గధామాన్ని తలపించే విధంగా నిర్మాణాలు చేపట్టి వ్యాపారం సాగిస్తున్నాడు. సుమారు 26 ఎకరాల మేర ఉన్న చెరువును కబ్జాచేశారు. ఇప్పుడా చెరువు కనీసం 10 ఎకరాలు కూడా మిగలలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. దానిపక్కనే 15 ఎకరాల ప్రభుత్వం శిఖం భూమి ఉంది. దాన్నీ వదలలేదు. ఒక ఆంధ్రావాడు తెలంగాణకు వలసవొచ్చి హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మణికొండలో ఇంతపెద్ద ఎత్తున భూములను కబ్జాచేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని గ్రామస్తులు అప్పట్లో అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. అయినా సమైక్య పాలకులు, వారికనుసన్నల్లో పనిచేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన భూములను లగడపాటి అత్యంత సస్తాకు తమ భూములను కబ్జాచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులదైవాలను కూల్చి.. భవంతుల నిర్మాణం
మణికొండలో వందల ఏళ్ల నుంచి గ్రామస్తుల కులదైవాల గుళ్లను నేలమట్టం చేసి ఆ ప్రాంతంలో భారీ భవంతులను నిర్మించాడు. అంతేకాదు.. అక్కడ దళితులు, దళితేతరులకు సంబంధించిన రెండు శ్మశానవాటికలు ఉన్నాయి. వాటినీ కబ్జాచేసి అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టాడు. ఓవైపు ఇది చేస్తూనే.. మరోవైపు ఆక్రమించిన చెరువుల్లో వందల లారీలతో మట్టిని నింపి చెరువుల ఆనవాళ్లు లేకుండా చేశాడు. లగడపాటి అక్రమాల దెబ్బకు మణికొండ శివారు ప్రాంతాలు, శ్మశానవాటికలు, చెరువుల రూపురేఖలే మారిపోయాయి. లగడపాటి భూదాహం ఎంత నీచానికి దిగజారిందంటే.. మణికొండ నుంచి ఖాజగూడకు ఉన్న రోడ్డును కూడా కబ్జాచేశాడు. ఇప్పటి వరకు రహదారులను కబ్జాచేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కానీ లగడపాటి మణికొండలో రహదారుల కబ్జాలకు కూడా పాల్పడ్డాడు. ఇలా నీచాతినీచంగా భూములు కబ్జాచేసి.. ఆకాశహార్మ్యాలు నిర్మించి వాటికి ల్యాంకోహిల్స్ అని నామకరణం చేశాడు. ఆ పేరుతో వీపరీతమైన అక్రమ వ్యాపారం చేస్తున్నాడు.
మణికొండలో తిరగాలంటే లగడపాటి అనుమతి తప్పనిసరి…
మణికొండ ప్రజలు తమ గ్రామంలో తిరగాలన్నా.. లగడపాటి రాజగోపాల్ అనుమతి తీసుకోవాల్సిందే. ల్యాంకోహిల్స్ కంపెనీ నుంచి ఇచ్చిన గుర్తింపు కార్డు ఉంటేనే ఇక్కడ తిరగాలని ఆదేశాలు జారీచేశారు. ల్యాంకోహిల్స్‌లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమ గ్రామంలో ఎవరైనా చనిపోయినా.. శవాలను పూడ్చాలన్నా.. కాల్చాలన్నా.. లగడపాటి పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. అదీకాకుండా పోలీసులతోనూ అనుమతి తీసుకుని 3 గంటల లోపు ఆదరబాదరగా తమ అంత్యక్రియలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మణికొండలోని శ్మశానవాటికలను కబ్జా చేసినందుకే ఈ పరిస్థితి దాపురించింది. చివరికి తమవారికి పిట్టకు పెట్టాలంటే కూడా నానాతంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడో ఆంధ్రా నుంచి తెలంగాణకు వలసొచ్చి.. తమ ఊరికొచ్చి తమ గ్రామంలో తిరగడానికి వాడి అనుమతి కావాలా..? అని అప్పట్లో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిపై తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి మణికొండలోని భూములను ఆంధ్రోళ్ల నుంచి స్వాధీనం చేసుకుని తిరిగి మణికొండ ప్రజలకు అప్పగించాలని పలువురు మణికొండ ప్రజలు, తెలంగాణవాదులు కోరుతున్నారు.
ప్రభుత్వ నెక్ట్స్ టార్గెట్ ల్యాంకోనే కావాలి…
తెలంగాణ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే.. హైదరాబాద్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూములు, అక్కడ నిర్మించిన అక్రమకట్టడాలపై కన్నేసింది. ఆ భూముల ఆక్రమణదారులపై కొరఢా ఝుళిపించింది. ఆ భూముల కబ్జాదారుల గుండెల్లో దడపుట్టించింది. అడ్డగోలుగా.. అనుమతి లేకుండా విచ్చలవిడిగా నిర్మించిన కట్టడాలను కూల్చేసింది. అలాగే ల్యాంకోహిల్స్‌లోని భూముల్లో అక్రమంగా వెలిసిన ఆకాశహార్మ్యాలపై తెలంగాణ సర్కార్ నజరేయాలి. ఆ భూములు ఎవరివి..? అక్కడ ఎవరు పెత్తనం చెలాయిస్తున్నారు..? ఆ భూములకు.. ఆ పెత్తందారికి ఉన్న సంబంధం ఏమిటి..? ఇక్కడ తిష్టవేసేందుకు ఆంధ్రా భూరాబంధులకు ఎవరు అనుమతిచ్చారు..? అనే వివరాలను బయటికి లాగి ఆంధ్రోళ్లను తరిమికొట్టేదాక.. ఆ భూములను తిరిగి మణికొండ ప్రజలకు ఇచ్చేదాక తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ల్యాంకోహిల్స్ భూముల అన్యాక్రాంతమే నెక్ట్స్ టార్గెట్ కావాలని హైదరాబాద్ ప్రజలతోపాటు యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.