వరదలతో ఉత్తర భారతం గజగజ

భారీ వర్షాలు.. 60 మందికి పైగా మృతి
ఉత్తర కాశీలో చిక్కుకుపోయిన రాష్ట్ర యాత్రికులు
ఆదుకోవాలని ఆర్థనాదాలు
డెహ్రాడూన్‌/హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :
వరద బీభత్సంతో ఉత్తర భారతం గజగజ వణుకుతోంది. భారీ వర్షాలకు గంగా, యమున వాటి ఉప నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌లో సోమవారానికి 60 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే సోమవారం రాత్రి వరకు మృతుల సంఖ్య 17కు చేరింది. నాలుగైదు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడం.. కొండచరియలు విరిగి పడడం.. రోడ్డు మార్గం అస్తవ్యస్తం కావడం.. నదులు పొంగి ప్రవహిస్తుండడం.. బదరీనాధ్‌, కేదరీనాధ్‌లలో సుమారు 30వేల మందికి పైగా యాత్రికులు అక్కడ చిక్కుకుని పోవడం తెలిసిందే. ఉత్తరకాశీకి 18 కిలోమీటర్ల దూరంలో భార్కాట్‌-గంగోత్రి మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 200 పైగా బస్సులు అక్కడే నిలిచిపోవడంతో యాత్రికులు నాలుగైదు రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కరీంనగర్‌, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, నల్గొండ జిల్లాలు, హైదరాబాద్‌ నగర వాసులు ఉన్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం సైనికుల ఆసరాను కోరింది. మంత్రివర్గం భేటీ అయింది. తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్‌ తదితరులు ఇప్పటికే పలుమార్లు ఉత్తరాఖండ్‌ సీఎం బహుగుణతో మాట్లాడినట్టు, యాత్రికుల సంరక్షణార్థం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వాకబు చేసినట్టు తెలిసింది. అక్కడి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా వర్షాలతో గంగానది, అలకానంద నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వరద ఉధృతి పెరుగుతున్నట్టు తెలిసింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా యాత్రికుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతోను, మంత్రులతోను చర్చిస్తోంది. సైన్యం ఆసరా తీసుకుని యాత్రికులను వారి వారి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
మా వారిని ఆదుకోండి..
యాత్రలకు వెళ్లి ఇరుక్కుపోయిన తమ కుటుంబ సభ్యులను, బంధువులను ఆదుకోవాలని కరీంనగర్‌, గుంటూరు, కృష్ణా, నల్గొండ, ఉభయగోదావరి, హైదారాబాద్‌ జిల్లాలకు చెందిన యాత్రికుల సంబంధికులు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మూడు రోజులుగా ఎలాంటి ఆహారం లేదని, కనీసం వచ్చి పరామర్శించిన వారు కూడా లేరని తమ బంధువులు తమకు ఫోను ద్వారా తెలియజేస్తున్నారని వారు వాపోతున్నారు. సరస్వతీ నదిపుష్కరాల్లో స్నానం చేద్దామని కొందరు. చార్‌దమ్‌ యాత్రకు అని కొందరు వెళ్లారన్నారు. ఇప్పటికే చార్‌దమ్‌ యాత్ర ముగించుకుని రుషికేష్‌ తదితర ప్రాంతాలకు చేరుకున్న వారు సైతం ఢల్లీికి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. చార్‌దమ్‌ యాత్రకు వెళ్లే మార్గం పొడవునా కొండచరియలు విరిగిపడ్డాయని తమ వారు చెబుతున్నారని అన్నారు. ఇదిలా ఉండగా రాజమండ్రికి చెందిన వారు సుమారుగా 100మంది, నల్గొండ జిల్లాకు చెందిన వారు 400మంది, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు, చాగల్లు మండలాలకు చెందిన కొందరు, కృష్ణా జిల్లాకు చెందిన వారు వంద మంది, కరీంనగర్‌ జిల్లాకు చెందిన పది కుటుంబాలు, హైదరాబాద్‌ నగరానికి చెందిన 70 మంది ఉన్నట్టు సమాచారం.