వర్షంతో భారత్‌ , కివీస్‌ ప్రాక్టీస్‌ రద్దు

విశాఖపట్నం ,సెప్టెంబర్‌ 6 :టీ ట్వంటీ మ్యాచ్‌ల కోసం విశాఖ చేరుకున్న భారత్‌ , న్యూజిలాండ్‌ జట్లకు వరుణుడు స్వాగతం పలికాడు. శనివారం జరగనున్న మ్యాచ్‌కు ముందు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేసుకోవాలనుకున్న వారి ఆశలపై నీళ్ళు చల్లాడు. ఇవాళ కుండపోతగా వర్షం కురవడంతో రెండు జట్ల ప్రాక్టీస్‌ సెషన్స్‌ రద్దయ్యాయి. ఆటగాళ్ళు ¬టల్‌ గదులకే పరిమితమయ్యారు. నగరంలోని ఏసిఏ విడిసిఏ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయాల్సి ఉండగా… వర్షం కారణంగా మైదానమంతా చిత్తడిగా మారింది. ఇండోర్‌ ప్రాక్టీస్‌కు ఇక్కడ వసతులు లేకపోవడంతో జట్లు స్టేడియానికి రాలేదు. ఇవాళ ప్రాక్టీస్‌ రద్దు చేసినట్టు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10 నుండి 1 గంట వరకూ న్యూజిలాండ్‌ , మధ్యాహ్నం భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే సాయంత్రానికి పరిస్థితిలో మార్పు కనిపించడంతో ఇదే షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ప్రాక్టీస్‌ చేస్తాయని ఎసిఎ వర్గాలు తెలిపాయి. బుధవారమే న్యూజిలాండ్‌ జట్టు , భారత్‌ ఆటగాళ్ళు ధోనీ , బాలాజీ , హర్భజన్‌ , తివారీ , దిండా వైజాగ్‌లో అడుగుపెట్టారు. మిగిలిన క్రికెటర్లలో యువరాజ్‌తో పాటు మరికొంతమంది ఇవాళ ఉదయం విశాఖకు చేరుకున్నారు. స్టేడియంలో యువీ రాక కోసం భారీ ఎత్తున అభిమానులు ఎదురుచూసినా… వర్షంతో ప్రాక్టీస్‌ రద్దవడంతో వారంతా నిరాశ చెందారు.