వసతుల లేమి వాస్తవం: ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో వసతుల లేమి వాస్తవమని, దీన్ని అధిగమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాల్సిన బాధ్యత మాత్రం అధ్యాపకులదేనని ఆయన సూచించారు. విద్యలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల మధ్య వ్యత్యాసం కనిపించినప్పుడు అది సమాజంలో అసమానతలకు దారితీస్తుందని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అంతర్గత అభివృద్ధిలో డిగ్రీ కళాశాలల పాత్ర అనే అంశంపై డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సదస్సులో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నాది అనే స్వభావం నుంచి మనందరిది అనే అభిప్రాయం సమాజంలో కలిగినప్పుడే రాష్ట్రంలో విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన కళాశాలలవైపు విద్యార్థులను ఆకర్షించడంలో ఎందుకు విఫలమవుతున్నమని అధ్యాపకులు ప్రశ్నించుకోవాల్సిన  అవసరం ఉందని ఆయన చెప్పారు.