వాటర్ గ్రిడ్‌లో అవినీతి రంధ్రాలు
– విచారణకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్
హైదరాబాద్,జూన్9(జనంసాక్షి):
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ స్కీమ్ అవినీతిరంధ్రాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లేకుండా రూ. 45 వేల కోట్ల ప్రాజెక్ట్ ప్రభుత్వం ఎలా చేపడుతోందని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ… అవినీతి, దోపిడి పద్దతుల్లోనే ఈ ప్రాజెక్ట్ టెండర్ల వ్యవహారం సాగుతోందని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ కార్పొరేషన్‌కు కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ చైర్మన్, వైస్ చైర్మన్‌గా కొనసాగుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. టెండర్లకు పిలవలేదని కేసీఆర్ అంటుంటే… రూ. 1700 కోట్లకు టెండర్లకు పిలిచామని కేటీఆర్ చెప్పడమే అవినీతి బాగోతానికి నిదర్శమని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు టెండర్ వేసేందుకు వీలుగా నిబంధనలను మార్చారన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల హావిూలో లేని వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సీఎం కేసీఆర్‌ను ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు నిధులను ఏ విధంగా సమకూరుస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలెవరు అవినీతిపరులు కాదన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ హితవు పలికారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్‌ట్లో ఉన్న అవినీతిని ఏసీబీ వెలికి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ అసలు టెండర్లు ఖరారు కాలేదంటూ అబద్దాలు చెబుతున్నారని ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. ఇదిలావుంటే ఏపీ, తెలంగాణ సీఎంలను కేంద్రం బర్తరఫ్ చేయాలని టి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం నాడు విూడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ కంటే ముందే కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు పదవులు ఎరవేయడం లంచం కాదా? అని నిలదీశారు. కేసీఆర్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్లను కూడా కొన్నారని ఆరోపించారు. ఒకాయన డబ్బులిస్తే.. కేసీఆర్ పదవులిచ్చారని అన్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపాలని భట్టీ డిమాండ్ చేశారు. ఎడ్లబండి కింద కుక్కలాగా పడుకుని తెలంగాణానంతా తానే మోస్తున్నట్లు.. కేసీఆర్ ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ¬దాలో కేసీఆర్ తాగుబోతుల భాషను మాట్లాడుతున్నారని విమర్శించారు.