తెలంగాణ బడ్జెట్‌ రూ.3.4లక్షల కోట్లు

  • 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.
  • రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.
  • మూలధన వ్యయం రూ.36,504 కోట్లు.

హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌ రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆదాయం అంచనాల కన్నా రూ.50 వేల కోట్ల వరకూ తగ్గుదల నమోదయ్యే సూచనలున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు. సభలో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాది ఆదాయం లక్ష్యాల మేరకు రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో తొలుత ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ఏప్రిల్, మే, జూన్‌ నెలల కోసం శాసనసభలో ప్రవేశపెట్టింది. మిగిలిన 9 నెలల కోసం 2024 జులై 25న పూర్తి పద్దును ప్రవేశపెట్టింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను తొలిసారి ఇప్పుడు ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ఆదాయంపై పూర్తి వాస్తవాలు తెలిశాయని, వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రభుత్వం చెపుతోంది.

రూ.26 వేల కోట్లు అడిగిన సాగునీటి పారుదల శాఖ

ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని సమాచారం. కొత్తగా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్, ఫ్యూచర్‌ సిటీ, మెట్రో రైలు విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి, దీనికి అనుసంధానంగా రేడియల్‌ రోడ్ల నిర్మాణం వంటివాటికి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ప్రధానంగా నీటిపారుదల, వ్యవసాయం, విద్య, రోడ్లు-భవనాలు, గృహనిర్మాణం, ఇంధన శాఖలకు అత్యధికంగా నిధులు దక్కనున్నాయి. సాగునీటి పారుదల శాఖ రూ.26 వేల కోట్లు అడిగింది. విద్యాశాఖ రూ.30 వేల కోట్లు అడిగినట్లు సమాచారం. కొత్తగా నిర్మించే యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పాఠశాలలకే రూ.11 వేల కోట్లు అవసరమని అంచనా. వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకానికి, కరెంటు ఛార్జీలు పెంచకుండా రాయితీ భరించేందుకు కలిపి రూ.21 వేల కోట్లు కావాలని రాష్ట్ర ఇంధనశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా దాదాపు రూ.18 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంధనశాఖకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించకుంటే వచ్చే నెల ఒకటి నుంచి కరెంటు ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నందున అడిగిన సొమ్ములో అత్యధికశాతం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

‘గ్యారంటీ’గా నిధులు: గ్యారంటీ హామీల అమలు కింద … వచ్చే ఏడాది రైతుభరోసాకు రూ.15 వేల కోట్లు, 9.69 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.37,274 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. రాజీవ్‌ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు, కొత్తగా ప్రారంభించే నగరాభివృద్ధి పథకానికి రూ.4 వేల కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు రూ.4 వేల కోట్లు, పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటుకు రూ.2 వేల కోట్లు అవసరమని సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇవన్నీ గ్యారంటీ హామీల పద్దు కింద వస్తున్నందున భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు, ఆయా వర్గాల సంక్షేమ పథకాలకు ఈ ఏడాది రూ.63 వేల కోట్లు కేటాయించినందున వచ్చే ఏడాది అంతకంటే పెంచే అవకాశాలున్నాయి.

ఆరోగ్యానికీ దండిగా….

2024-25 సంవత్సరం పద్దులో వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం రూ.11,800 కోట్లు కేటాయించింది. ఈ సారి కనీసం రూ.18 వేల కోట్ల వరకు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది.రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకంపై ఇచ్చిన గ్యారంటీ హామీ అమలులో భాగంగా ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించే యోచనలో ఉంది. ఈ పథకానికి ఇప్పుడు ప్రతినెలా రూ.50 కోట్లు అందుతున్నాయి. వీటిని రూ.వంద కోట్లకు పెంచాలని వైద్యశాఖ కోరినట్లు తెలిసింది.