పెద్దల భవనాలపై ఉదాసీనత ఎందుకు?
` నిబనంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని కూడా కూల్చేయాలి
` కేవలం పేదల ఇళ్లే తొలగించడం సరికాదు
` హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
హైదరాబాద్(జనంసాక్షి): హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇళ్లే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే ప్రభుత్వ భూములను రక్షించినట్లు అవుతుందని పేర్కొంది. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం.. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినా చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలిపింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.