ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెడ్‌కార్నర్‌ నోటీసులు

ఫోన్‌ ‍ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై ఇంటర్‌పోల్‌ నుంచి సీబీఐకి.. అక్కడి నుంచి తెలంగాణ సీఐడీ నుంచి సమాచారం అందింది. దీంతో ఈ ఇద్దరు నిందితులను భారత్‌కు రప్పించడానికి మార్గం సుగమమైంది.

తెలంగాణలో కిందటి ఏడాది తీవ్ర సంచలనం సృష్టించింది ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు తోపాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌రావుల(టీవీ చానెల్‌ మాజీ ఓనర్‌)పై సిట్‌ దృష్టిసారించింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలన్నా.. ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరమేర్పడిందని దర్యాప్తు బృందం చెబుతోంది.

ప్రణీత్‌ రావు అరెస్ట్‌ తర్వాత కిందటి ఏడాది మార్చి 10వ తేదీన ఫోన్‌​ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. స్వదేశం తీసుకొచ్చేందుకు రాష్ట్ర హోం శాఖ.. కేంద్ర హోం శాఖ సమన్వయంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  ఈలోపు మిగతా నిందితులందరికీ ఈ కేసులో బెయిల్‌ లభించింది.

మరోవైపు.. వారిని ఎప్పటిలోగా అరెస్ట్‌ చేస్తారంటూ ఇటీవల నాంపల్లి న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. అయితే..  వీలైనంత త్వరగా వీరిద్దరినీ తీసుకొచ్చేందుకు పోలీసులు మమ్మర చర్యలు చేపట్టారు.  ఈ క్రమంలోనే  ఈ ఇద్దరు నిందితులపై రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే వీరిద్దరి పాస్‌పోర్టులను పోలీసులు రద్దు చేయించిన సంగతి తెలిసిందే.

ఇక, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల గురించి డీహెచ్ఎస్‌కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించే ఛాన్స్ ఉంది. అయితే.. రెడ్‌ కార్నర్‌ అంటే అంతర్జాతీయ అరెస్ట్‌ వారెంట్‌ ఏం కాదు. అది కేవలం రిక్వెస్ట్‌ మాత్రమే. ఇంకోవైపు.. భారత్‌కు వచ్చేందుకు ప్రభాకర్‌ సిద్ధంగా లేని పరిస్థితులు చూస్తున్నాం. దీంతో అక్కడి న్యాయస్థానాలను గనుక ఆయన ఆశ్రయిస్తే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురు కావొచ్చు.