వాటర్ గ్రిడ్ భగిరథ యజ్ఞం
తెలంగాణ సాధించనట్టే సాధిస్తాం..
నాలుగేళ్ళలో ప్రతి ఇంటికి మంచినీరు
మానేరు-సిద్దిపేట తాగునీటి ప్రాజెక్టును పరిశీలించిన సీఎం కేసీఆర్
సిద్దిపేట/ ఎల్‌ఎండీ (కరీంనగర్), డిసెంబర్10(జనంసాక్షి) : వాటర్ పథకాన్ని భగీరథ యజ్ఞంగా తెలంగాణ సర్కార్ చేపట్టిందనీ, ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తుందని దానికి ఇంజనీర్లు పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందరం కలిసి కట్టుగా ఈ బృహత్ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. బుధవారం సిద్దిపేటలో వాటర్‌గ్రిడ్‌పై మంత్రులు, అధికారులకు కేసీఆర్ అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సిద్ధిపేట వాటర్ గ్రిడ్ పథకాన్ని 90 శాతం తానే డిజైన్ చేశానని చెప్పారు. వాటర్‌గ్రిడ్‌కు పదిశాతం ఇంజినీర్ల సహకారం తీసుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టుగానే ఈ బృహత్తు కార్యాన్ని సాధిస్తామని అన్నారు. గతంలో తాను చేపట్టిన సిద్ధిపేట వాటర్ స్కీం నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. సిద్దిపేట వాటర్ స్కీం స్పూర్తిగా తెలంగాణ వాటర్‌గ్రిడ్ అమలు జరుగుతుందని పేర్కొన్నారు. సిద్ధిపేట వాటర్ గ్రిడ్ ద్వారా 180 గ్రామాలకు తాగునీరందుతుందని వెల్లడించారు. తెలంగాణ వాటర్‌గ్రిడ్ ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటోందని.. అందరం కలిసి ఒక అవగాహనకు వస్తే పని ఈజీ అవుతుందన్నారు. మిడ్ మానేరు ద్వారా కరీంనగర్ జిల్లా మొత్తానికి తాగునీరు సరఫరా అవుతుందని తెలిపారు. అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్లాన్ లు రెడీ చేశామని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకు తాను 37 సార్లు ఎల్‌ఎండీని సందర్శించానని చెప్పిన సీఎం, ఎల్‌ఎండీలో చివరి నీటి బొట్టును కూడా తీసుకునేలా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. ఒకపుడు సిద్ధిపేట నియోజకవర్గంలో భయంకరమైన నీటి సమస్య ఉండేదన్నారు. ఎండాకాలం వచ్చిందంటే నీటికోసం యుద్ధాలు జరిగేవని.. రేయింబవళ్లు కష్టపడి తాగునీటిని అందించామని తెలిపారు. యావత్ దేశం తెలంగాణ వైపు తిరిగి చూసేలా పేరు తెచ్చుకుంటామని ఉద్ఘాటించారు. కష్టపడి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కేసీఆర్ అధికారులను కోరారు. వాటర్ గ్రిడ్ పథకం అనుకున్న సమయానికి పూర్తి చేసి దేశం తెలంగాణ వైపు చూసేలా చేద్దామని సీఎం కేసీఆర్ ఇంజనీర్లకు పిలుపునిచ్చారు. వాటర్ గ్రిడ్ పథకంపై ఇంజనీర్లకు అవాగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని సీఎం అన్నారు.. ఇంజనీర్లు తల్చుకుంటు కష్టసాధ్యమేవిూ కాదని ఆయన అన్నారు. రాత్రింబవళ్లు పనిచేసి అసాధ్యాన్ని సుసాద్యం చేద్దామని చెప్పారు. ఇంజనీర్లు చెమట చుక్కలు రాలిస్తేనే ప్రజలకు నిటీ చుక్క దొరుకుతుందన్నారు. సిద్దిపేట వాటర్ గ్రిడ్ ప్రారంభించినపుడు చాలా మంది తనను ఎగతాళి చేశారని, ఎవరి మాటలకూ తాను వెనకాడలేదని, 18 నెలల్లో ప్రతి గ్రామానికి మంచి నీరు అందించగలిగామని చెప్పారు. మనకు నాలుగు సంవత్సారాల సమయముందని, సిద్దిపేట స్ఫూర్తిగా ముందుకు సాగుదామని ఇంజనీర్లకు ఉత్సాహాన్నిచ్చారు. ఇంజనీర్లకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ నిధులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు చాలా దేశాలనుంచి అప్పులివ్వడానికి వస్తున్నారని, దీనికి నిధుల కొరత అనేదే ఉండదని చెప్పారు. అందరూ కలిసి జట్టుగా పనిచేస్తే ప్రజలకు మంచి నీరు అందీయగలమని సీఎం చెప్పారు ఇంజినీర్ల జేబులో 24 గంటలు కాంటూర్ బుక్ ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీ రాజ్,గ్రావిూణాభివృద్ది, పురపాలక శాఖ, ఉన్నతాధికారులు,ఇంజనీర్లు పాల్గొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు ప్రాజెక్టు నుంచి సిద్దిపేట పట్టణానికి నీరు చేర వేసే ప్రాజెక్టు పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్వయంగా విరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం పై అధికారులకు అవగహన కలిపించేందుకు ఆయన బుధవారం అధికారులతో కలిసి మానేరు-సిద్దిపేట వాటర్ ప్రాజెక్టును పరిశీలించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఆయన ఈ పనులను చేపట్టారు. అప్పటినుంచి ఇది సిద్ది పేట ప్రజల మంచినీటి అవసరాలను తీరుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా ఆయన బెజ్జంకి మండలం హన్మాజీపల్లి పరిధిలోని దిగువ మానేరు జలాశయం వద్ద గల ఇన్‌టెక్ వెల్‌తో పాటు పైపులైన్‌ను సందర్శించారు. . జలవలయం సాధ్యాసాధ్యాలపై ఉన్న అనుమానాలను నివృత్తిచేయడంతో పాటు గ్రావిూణ నీటి సరఫరా విభాగంలోని ఉన్నతాధికారులకు ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు సీఎంఈ ప్రయత్నం చేసారు. బుధవారం ఉదయం నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన హెలికాప్టర్‌లో పర్యటనకు బయలుదేరారు. మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఉండటంతో నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా సీఎం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. హన్మాజిపల్లి వద్ద ఇన్ టేక్ వెల్ ను అధికారులతో కలిసి సీఎం పరిశీలించారు. పైపు లైన్లును కూడా పరిశీలించారు. అక్కడ నుంచి అధికారులతో హెలీకాప్టర్ లో సిద్దిపేటకు బయలుదేరారు. మార్గమధ్యంలో పైపులైను,నీటి గ్రావిటీ,తదితర విషయాలను సీఎం అధికారులకు వివరించారు. ఏరియల్ సర్వే ద్వారా ఇల్లంతకుంట, యశ్వాడ,కమ్మరపల్లి,అనతసాగర్,రాజగోపాల్ పేట, ఇరుకోడ గ్రామాల్లో మంచినీటి సరఫరాను పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి సిద్దిపేటకు చేరుకొన్నారు. రూ.6.8 కోట్లతో కోమటి చెరువు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు.లోయర్ మానేరు డ్యాం – సిద్దిపేట వాటర్ ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రుల బృందం సిద్దిపేట నుంచి ప్రత్యేక బస్సులో వెళ్ళింది. ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు నాయిని,పద్మారావు,మహేందర్ రెడ్డి,జోగు రామన్న,ఎంపి ప్రభకర్ రెడ్డి మానేర్ డ్యాంను పరిశీలించారు. మంచినీటి సరఫరా పైపులైన్ల పని తీరును స్థానిక అధికారులు మంత్రులకు వివరించారు.