‘వారు’ ఓకే వేదికపై…

3

మమత సమక్షంలో ఒకే వేదికపై జైట్లీ, కేజ్రీవాల్‌

కోల్‌కతా,జనవరి 8(జనంసాక్షి): దిల్లీ క్రికెట్‌ సంఘం వివాదంలో పరస్పర విమర్శలు చేసుకుంటున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈరోజు ఒకే వేదికపై కన్పించారు. ఇందుకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వేదికైంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహింస్తున్న గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ కు ఉప్పు..నిప్పుగా వ్యవహరిస్తున్న కేంద్ర ఆర్థికశాఖ, ఢిల్లీ సీఎంలు అతిధులుగా హాజరయ్యారు.పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోల్‌కతాలో నిర్వహిస్తున్న బిజినెస్‌ సమ్మిట్‌కు వీరిద్దరూ హాజరయ్యారు. రాజకీయ పరిణామాలన్నీ పక్కనపెట్టి మమతాబెనర్జీ ఇరువురు నేతలనూ కార్యక్రమానికి ఆహ్వానించారు. జైట్లీ ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు.  దిల్లీ జిల్లా క్రికెట్‌ బోర్డు(డీడీసీఏ)లో జరిగిన అవకతవకల విషయంలో జైట్లీ, కేజీవ్రాల్‌ల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. జైట్లీ హయాంలోనే డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ కేజీవ్రాల్‌, ఆప్‌ నేతలు ఆరోపిస్తుండగా.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జైట్లీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరుకావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి మతకలహాలు లేవని పేర్కొన్నారు.

గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ రెండురోజులు జరగనుంది.  భూటాన్‌ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్‌ మంత్రి, బ్రిటన్‌ మంత్రి సహా పలువురు ప్రముఖులు సదస్సుకు హాజరైయ్యారు. డీడీసీఏ వ్యవహారంలో అరుణ్‌జైట్లీ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నిరాధార ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారని పేర్కొంటూ అరుణ్‌జైట్లీ ఢిల్లీ హైకోర్టులో రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. కేసు విచారణ కొనసాగుతుంది.