వికటించిన ఇంజక్షన్..
– 25 మందికి తీవ్ర అస్వస్థత!
– ముగ్గురి పరిస్థితి విషమం.. చికిత్స అందిస్తున్న వైద్యులు
– శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో ఘటన
శ్రీకాకుళం, ఆగస్టు 4(జనం సాక్షి) : శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఇంజక్షన్ వికటించి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రిమ్స్‌లోని మహిళల వార్డులో శుక్రవారం సాయంత్రం డ్యూటీ సిబ్బంది ‘సెఫ్రియాక్సోన్ యాంటీబయోటిక్ ఇంజక్షన్’ను రోగులకు ఇచ్చారు. అయితే ఇంజక్షన్ వేసిన కొద్దినిమిషాలకే 25 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హూటాహుటిన వారందరిని అత్యవసర విభాగానికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఇద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై రిమ్స్ హాస్పిటల్ ఆర్‌ఎంఓ అప్పలనాయుడు స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరం. 2020 వరకూ కాలపరిమితి ఉన్నప్పటికీ.. ఇంజక్షన్ వికటించిందన్నారు. ఆసుపత్రిలో మిగిలి ఉన్న అన్ని సెఫ్రియాక్సోన్ యాంటీబయోటిక్ ఇంజక్షన్‌లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామని.. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.