విజయమ్మది రాజకీయ యాత్రే..
రాజకీయ లబ్ధికోసమే దీక్ష చేపట్టింది : బొత్స
హైదరాబాద్, జూలై 24 : కేవలం రాజకీయ లబ్ధికోసమే విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టిందని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో క్షమించదని అన్నారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి కుమ్మక్కయ్యే అవసరం లేదని బొత్స అన్నారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం కాదని అన్నారు. రాష్ట్రంలో ఏవరైనా ఎక్కడైనా సమావేశాలు పెట్టుకునే హక్కు ఉందని, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. గతంలో చంద్రబాబు వరంగల్ దీక్షకు కూడా భద్రత కల్పించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే రాజకీయ పర్యటనలకు వెళ్లే ముందు స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. కేవలం రాజకీయంగా లబ్ధిపొందాలన్న ఆలోచనతోనే విజయమ్మ దీక్షకు పూనుకున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు ఇన్సురెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు. బిసిలను దగ్గరకు చేర్చుకునేందుకే చంద్రబాబునాయుడు బిసి డిక్లరేషన్ నాటకమాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు దగ్గరవుతున్నారన్న దుగ్ధతోనే ఆయన ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగపరంగా ఎస్సీ, ఎస్టీలకు చట్టప్రకారంగా భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రూపొందిస్తుందని ఆయన అన్నారు. అయితే బడుగు, బలహీన వర్గాలు తమకు దూరమవుతున్నారన్న భయంతో చంద్రబాబు బీసీల పాట పాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు 20 సంవత్సరాల తన రాజకీయ జీవితంలోను, ఎనిమిదేళ్ల సిఎం పదవీ కాలం సమయంలోను బీసీిలను ఎప్పుడు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. బీసీల డిక్లరేషన్,
10 వేల కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. బిసిల సంక్షేమానికై కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కొత్తగా తమ ప్రభుత్వం చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదన్నారు. బిసిలకు కాంగ్రెస్ పార్టీపై అపార నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మాత్రమే అన్నానని, విభజన కోరుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు బొత్స సమాధానమిచ్చారు.