విజయమ్మ రాకను అడ్డుకుంటాం : లక్ష్మీకాంతరావు
కరీంనగర్, జూలై 21 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యతిరేకి అని, ఆయన కుటుంబం తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వబోమని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఇక్కడ శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో చేనేత కార్మికులు ఆకలితో అలమటించి మృతి చెందారని, అయినప్పటికీ ఏనాడూ వారి కుటుంబాల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారికి మద్దతు ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లకు రావడం వెనుక ఏదో ఎత్తుగడ ఉన్నదని ఆయన విమర్శించారు. శనివారం సిరిసిల్ల పట్టణంలో టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు సిద్ధం వేణు, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు సంతోష్, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.