విజయవంతంగా పల్లెబాట

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 : తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రజలను              చైత్యనపరిచే  కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం 8వ రోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా కొనసాగింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు గోవర్ధన్‌రెడ్డి, బోజారెడ్డి పాల్గొన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణవాదానికి పట్టం కట్టి ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలను మరోసారి మోసం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు పాదయాత్రలు చేపడుతూ ప్రజలకు అమలు కాని హామీలను ఇస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయన్నారు. ఉద్యమం ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.