విద్యారంగాన్ని పటిష్టం చేయాలి
నిధుల కేటాయింపు పెంచాలి: ఎస్‌ఎఫ్‌ఐ
ఆదిలాబాద్,జూలై4(జనంసాక్షి): విద్య ప్రైవేటీకరణను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరవాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. సంఘ్ పరివార్ ఆమోదంతోనే పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర, సైన్స్ విషయాలలో మార్పులకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇదివరకు విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు మేధో సంపత్తిని పెంచే విధంగా ఉండేవని, ప్రస్తుతం నైపుణ్యాలు పెంపొందించే కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రమిక సంస్థలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. దీనితో ప్రస్తుత తరం వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు సమాజం గురించి అవగాహన లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పిన తెరాస ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను స్వాగతించడం సరికాదని అన్నారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇకపోతే ప్రైవేట్ యూరనివర్సిటీ లతో మన విద్యారంగం పూర్తిగా కుంటుపడుతుందని, దీనిపై విస్తృతంగా చర్చించామని అన్నారు. దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు నెలకొల్పడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. దీనికి తోడు డైట్, బీఈడీ కళాశాలల్లో తరగతుల కోసం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. దీని ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు భవిష్యత్తులో చేయమని, విద్యను ప్రైవేట్ పరం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నట్లుందని అన్నారు.